భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. పర్యటన తర్వాత తక్షణ సాయంపై కేంద్ర బృందం సిఫారసు చేస్తుందని తెలిపారు.
ఏపీలో వరద పరిస్థితిపై సత్వరమే స్పందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర బృందం సిఫార్సుల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. బాధిత ప్రజలకు సకాలంలో సహాయాన్ని అందించడానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
భారీ వరదలతో విజయవాడ సహా పలు ప్రాంతాల ప్రజలకు అంతులేని కష్టం వాటిల్లింది. ఈ విపత్తునుంచి కోలుకొని సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది. ప్రజలకు పెద్ద ఎత్తున ఆహారం, నిత్యావసరాలను అందిస్తున్నారు.
వరద బాధితుల సంఖ్య 6.44లక్షలకు చేరగా వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 63 వేల కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు అధికారులు గుర్తించారు. విజయవాడలో వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో బురద నీటి తొలగింపు పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వీధుల్లో, ఇళ్లలో ఉన్న బురదను అగ్నిమాపక సిబ్బంది శుభ్రం చేసి బ్లీచింగ్ చేస్తున్నారు. 2 వందల 50 ఫైరింజన్‌లతో బురద తొలగింపు కార్యక్రమం చేపట్టారు.
కాగా, భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, పల్నాడు జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారని పేర్కొంది. 1,69,370 ఎకరాల్లో పంట, 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపింది.
ఈ వరదల కారణంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయినట్లు తెలిపింది. 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందినట్లు వెల్లడించింది. వరదల వల్ల 22 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని పేర్కొంది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని తెలిపింది. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు రంగంలో దిగాయని ఆరు హెలికాఫ్టర్లు, 228 బోట్లు పని చేస్తున్నాయని తెలిపింది. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్లు పేర్కొంది. కృష్ణా నదికి 3 లక్షల 16 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందని ప్రభుత్వం వివరించింది.
వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వానికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు “CEO Smart Andhra Pradesh Foundation”కు పంపవచ్చని స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ సీఈవో కె. శివశంకర్ వెల్లడించారు. దీని ద్వారా విరాళాలు ఇస్తే సీఎస్ఆర్ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయన్నారు. చెక్కులు, డీడీలను సీఈవో, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ పేరుతో పంపవచ్చని వెల్లడించారు.
విరాళాలు ఇచ్చే వారికి పన్ను మినహాయింపు సర్టిఫికెట్లు ఇస్తామని తెలిపారు. భారత్ బయోటెక్ సంస్థ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్‌కు కోటి విరాళం ఇవ్వటం శుభపరిణామని శివశంకర్ అభినందనలు తెలిపారు. వరదలో మునిగిన వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు.
వరదల్లో భారీ ఎత్తున బైక్‌లు, నాలుగు చక్రల వాహనాలు నీట మునిగాయి. వాహనాలు రిపేర్ చేయించేందుకు ఒక్కో కుటుంబానికి వేలల్లో ఖర్చు అవుతుందని అంచనా వేసింది. వరద బాధితుల భారం తగ్గించేందుకు సీఎం చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలెన్ని? ఇన్సూరెన్స్ లేని వాహనాలు ఎన్ని? అనే అంశంపై ప్రభుత్వం లెక్కిస్తుంది. ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను పక్కన పెట్టాలని ఇన్సూరెన్స్ కంపెనీలను కోరనుంది.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు