ఎన్‌సి, పిడిపి తరఫున మాజీ తీవ్రవాదుల ప్రచారం

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) మాజీ తీవ్రవాదుల మద్దతు తీసుకుంటున్నాయని బిజెపి మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బుధవారం ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కేంద్ర పాలిత ప్రాంతాన్ని ‘కల్లోలిత కాలానికి’ తిరిగి తీసుకుపోజూస్తున్నాయని ఆయన హెచ్చరించారు. 

అబ్దుల్లాలు, ముఫ్తీలను బిజెపి జెకె ఇన్‌చార్జి రామ్ మాధవ్ ప్రస్తావిస్తూ, ఆ రెండు కుటుంబాలను ఇంటి దారి పట్టించాలని పిలుపు ఇచ్చారు. ‘మాజీ తీవ్రవాదులు ఎన్‌సి, పిడిపి అభ్యర్థుల తరఫున బాహాటంగా ప్రచారం చేస్తున్నారని నాకు సమాచారం అందింది. జెకెను తిరిగి పాత దుర్దినాల దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్న పార్టీలను జనం ఓడించి, శాంతిని, పురోగతిని కోరుతున్న కొత్త నాయకత్వాన్ని సమర్థించవలసి ఉంటుంది’ అని రామ్ మాధవ్ శ్రీనగర్‌లో విలేకరులతో విజ్ఞప్తి చేశారు.

నామినేషన్ల దాఖలు సమయంలో లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఐజాజ్ హుస్సేన్ వెంట మాధవ్ ఉన్నారు. 370 అధికరణం, రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కాశ్మీర్ సమస్య పరిష్కారం, పాకిస్తాన్‌తో చర్చలు గురించిన వాగ్దానంతో ఎన్‌సి, పిడిపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోల గురించి మాధవ్ ప్రస్తావిస్తూ, ఆ రెండు ప్రాంతీయ పార్టీలు జెకెను మళ్లీ పూర్వపు, కల్లోలిత రోజులకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు.

‘ఎన్‌సి, పిడిపి, ఇతరులు జెకెను తిరిగి పాత, కల్లోలిత రోజులకు తీసుకువెళ్లేలా మేనిఫెస్టోలను వెలువరించాయని జెకె ప్రజలకు గుర్తు చేయదలిచాను’ అని ఆయన చెప్పారు. కాశ్మీర్ లోయలో కొత్త పార్టీలు, కొత్త నేతలు ఆవిర్భవించనున్నట్లు. జమ్మూ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి ప్రతినిధిగా బిజెపి అవతరించనున్నట్లు ఆయన తెలిపారు. జెకెలో బిజెపి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగలదని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.

యువ అభ్యర్థులు అనేక మంది ఎన్నికల్లో పోటీ చేస్తుండడం గురించి ప్రశ్నించగా, ఇది జెకె ప్రజల వ్యూహం అని, వారు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన సమాధానం ఇచ్చారు. ‘గణనీయ సంఖ్యలో యువజనులు ముందుకు వస్తున్నారు. వారికి మద్దతు ఇవ్వాలి. ఈ రాష్ట్రం రెండు కుటుంబాల గుప్పిట్లో చిక్కుకుని ఉంది. ఆ రెండు కుటుంబాలను ఇంటి దారి పట్టించాలి’ అని స్పష్టం చేశారు. 

 ఏ పార్టీకీ ఆధిక్యం రాని పక్షంలో బిజెపి ఏ పార్టీతోనైనా చేయి కలుపుతుందా? అని ప్రశ్నించినప్పుడు, బిజెపి ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ‘అటువంటి పరిస్థితి వస్తే మేము తరువాత దానిపై చర్చిస్తాం’ అని మాధవ్ చెప్పారు. అయితే తమ పార్టీ 45 సీట్లను గెలుచుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. జమ్మూ ప్రాంతంలో 35, కాశ్మీర్ లోయలో 10 సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు.

కాశ్మీర్ లో 10 సీట్లు గెల్చుకొనేందుకు తమకు ప్రజల మద్దతు అవసరం అని చెబుతూ, అదే జరిగితే దశాబ్దాలుగా కాశ్మీర్ ను అణచివేస్తున్న వారు వెనుకడుగు వేయాల్సిందే అని స్పష్టం చేశారు.  జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ గురించి అడుగగా, తమ మొదటి ప్రాధాన్యత ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని చెప్పారు.

ఈ ప్రాంతం చరిత్రలో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ నెల 6, 7 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పార్టీ ఎన్నికల ప్రణాలికను విడుదల చేయనున్నారని రామ్ మాధవ్ తెలిపారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.