అడ్డగోలు గ్యారెంటీలతో హిమాచల్ ప్రభుత్వ ఖజానా ఖాళీ

 
* కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు సహితం అంతే!
 
పది గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలిచ్చి హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ర్టాన్ని దివాలా దిశగా పరుగులు పెట్టిస్తున్నది. హామీల అమలు పేరిట ఇప్పటికే కొత్త అప్పులు, పింఛనర్ల సంక్షేమ నిధి డబ్బులను వాడుకొన్న సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు సర్కారు.. ప్రభుత్వోద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా నానా యాతన పడుతున్నది. 
 
ఒకటో తారీఖు వచ్చి మూడునాలుగు రోజులు గడిచినప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు జమ కాలేదు. 2022 చివర్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్‌ విధానం అమలు వంటి అనేక హామీలు ఇచ్చింది. 
 
అయితే, హిమాచల్‌ ప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. ఇదేమీ పట్టించుకోకుండా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు సర్కారు ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టే పనిని ప్రారంభించింది. రాహుల్‌ గాంధీ చెప్పే ‘ఖటాఖట్‌’ ఉచితాల వల్లే రాష్ర్టానికి ఈ పరిస్థితి దాపురించిందని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ ఆరోపించారు.
 
 కాగా, దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ రాష్ర్టం అప్పు రూ.86,589 కోట్లకు చేరింది. రాష్ట్రంలో ఒక్కొక్కరిపై రూ.1.17 లక్షల అప్పు భారం ఉంది.  మరోవైపు కొత్త పింఛన్‌ పథకం అమలు వల్ల రాష్ట్రం కొత్త అప్పు తీసుకోవడంపై కేంద్రం పరిమితులు విధించిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. 
 
ఒకవైపు ఇప్పటికే ఉన్న అప్పులకు మిత్తీల భారం, మరోవైపు కొత్త అప్పులపై పరిమితులు, పెరిగిపోయిన పథకాల భారంతో సుఖు సర్కారుకు దిక్కుతోచడం లేదు. ఆఖరికి పెన్షన్ల శాఖలో ఉండే పింఛనర్ల సంక్షేమ నిధి నుంచి సైతం ప్రభుత్వం డబ్బును వాడుకుంది. తమ జీతాలు రెండు నెలలు వాయిదా వేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.
 
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్లు నిలిపివేయాలని మంగళవారం ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో వారిపై అనర్హత వేటు పడింది. వీరి పింఛన్లను నిలిపివేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది.

14 సబ్సిడీలకు కత్తెర పెట్టేందుకు కసరత్తు

మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వడం ప్రధానంగా ఆర్థిక భారం మోపుతున్నదని అధికారులు చెప్తున్నారు. ఇక, రాష్ట్రం ఈ పథకాల భారాన్ని మోయలేదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు వాటికి కోతలు పెట్టే పనిని ప్రారంభించింది. అన్ని కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ఇంకా ఈ పథకాన్ని అమలు చేయలేదు. 

పైగా ఇప్పటికే ఉన్న 125 యూనిట్ల విద్యుత్తు సబ్సిడీపై కోతలు విధించింది. బీపీఎల్‌ పరిధిలో ఉన్న వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించింది. మొత్తం 14 సబ్సిడీలపై కోతలు విధించేందుకు సిద్ధమైంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించి 50 శాతం టికెట్‌ వసూలు చేయాలని నిర్ణయించింది. ఉచిత నీటి సరఫరా పథకాన్ని నిలిపివేయాలని భావిస్తున్నది.

అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఇంకా పలు హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదు. మరోవైపు ఉన్న పథకాలకు సైతం కత్తెర పెడుతుండటం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాంగ్రెస్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అలవెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఆఖరికి పింఛన్ల సంక్షేమ నిధి నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నదని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్‌ ఆరోపించారు. ఉద్యోగులకు వేతనాలు సమయానికి ఇవ్వడం లేదని, కాంగ్రెస్‌ సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే ఆర్థిక సంక్షోభానికి కారణమన్నారు.

ఇదే బాటలో కర్ణాటక, తెలంగాణ!

గ్యారెంటీల పేరుతో గెలిచిన కర్ణాటక, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ వ్యవహారం ఇదే రకంగా ఉంది. కర్ణాటకలో గ్యారెంటీల అమ లు ఆ రాష్ట్రంపై ఆర్థిక భారం మోపి ంది. దీంతో ధరలు పెంచి, ఖజానా నింపేందుకు సిద్ధరామయ్య సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మరోవైపు గ్యారెంటీల అమలును సైతం పునఃపరిశీలించాలని కాంగ్రెస్‌ నాయకులే డిమాండ్‌ చేస్తున్నారు. గ్యారెంటీలు అమలు చేయలేకనే ఈ డిమాండ్‌ తెరపైకి తెస్తున్నారనే వాదన ఉంది. 

ఇక, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా హామీల అమలును మాత్రం పట్టించుకోవడం లేదు. ఒకటి, రెండు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సర్కారు చెప్తున్నప్పటికీ లబ్ధిదారులు అందరికీ అందడం లేదు. ఈ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్‌ వ్యవహారాన్ని చూస్తుంటే కేవలం ఎన్నికల్లో గెలిచేందుకు ఇష్టారీతిన హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్నదని స్పష్టం అవుతుంది. పథకాలు, సబ్సిడీలకు కోతలు విధించడానికి ఇవాళ హిమాచల్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టిందని, రేపు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలూ ఇదే వైఖరిని పాటించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.