విజయవాడకు మరోసారి బుడమేరు ముంపు ముప్పు!

ఏపీలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు విజయవాడలో వరద నీరు బీభత్సం సృష్టించింది.  భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటికే విజయవాడలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెజవాడను మరోసారి వరద ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
బుడమేరుకు మంగళవారం 1000 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా బుధవారం 8,000 క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. వాగుకు 3 చోట్ల గండ్లు పడగా ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే ప్రక్రియను మంత్రి లోకేష్‌, మంత్రి నిమ్మల రామనాయుడుకు అప్పగించారు. వరద ఎక్కువగా ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతోంది.
 
గండ్లు పడడానికి ప్రధాన కారణం గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మట్టి తవ్వకాలేనని రైతులు అంటున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు  రికార్డు స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత 30ఏళ్లలో బుడమేరు ఎన్నడు ఇంతటి ఉదృతంగా ప్రవహించలేదని అక్కడి ముంపు ప్రాంతాల ప్రజలు అంటున్నారు.
 
పుట్టగుంటలో వరద నీరు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా చొచ్చుకొచ్చాయి . దాంతో అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే అరిపిరాలలో అత్యంత ప్రమాద స్థితిలో బుడమేరు ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ కట్టకు అడుగు దూరంలో నీరు ప్రవహిస్తోంది. 
 
అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో భయాందోళనలో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు ఉన్నారు. బోట్ల ద్వారా ముంపు ప్రాంతాల ప్రజలను ఒడ్డుకు చేర్చడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు . 3వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. పలు చోట్ల చేపల చెరువులకు గండ్లు పడ్డాయి.

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి తగ్గింది. ఉదయం 7గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,81,694 క్యూసెక్కలుగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఎత్తివేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది.

కాగా, గురువారంకు పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్‌, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి బెజవాడ నగరంలో ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే మరో అల్పపీడనం హెచ్చరికలు ఉండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

 
వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం తరపున అందించనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
 

ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంప, కేజీ చక్కెర అందించాలని సీఎం ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని తేల్చిచెప్పారు. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయడంతో పాటు శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలని అధికారులను ఆదేశించారు.