బ్రూనైతో బలమైన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నా

వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బ్రూనైతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చారిత్రక బంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే ఈ భేటీ ఉద్దేశమని తెలిపారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన తొలుత బ్రూనై చేరుకున్నారు. 
 
బ్రూనై దారుస్సలాం విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ యువరాజు అల్‌ ముహ్‌తడీ బిల్లా ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక వందనం స్వీకరించారు.  బ్రూనైతో భారత ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా అక్కడ పర్యటిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. ఆ దేశంతో భారత చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.
 
బ్రూనైతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజులు విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై వెళ్లిన ప్రధాని బుధవారం ఆ దేశ సుల్తాన్​ హసనల్ బోల్కియాతో భేటీ అయ్యారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇరువులు విస్తృతమై చర్చలు జరిపి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
భారతీయుల తరపున బ్రూనై ప్రజలకు ప్రధాని మోదీ 40వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాక్షాంకలు తెలిపారు. బ్రూనైతో భారత్​ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 40 సంవత్సరాలు కావడం కూడా సంతోషంగా ఉందని తెలిపారు. ​ ఈ పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడానికి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఎక్స్​ వేదికగా తెలిపారు.
 
‘ సుల్తాన్ హసనల్ బోల్కియాను కలవడం ఆనందంగా ఉంది. యాక్ట్‌ఈస్ట్‌ విధానం, ఇండో- పసిఫిక్ విజన్​లో భారత్‌కు, బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. ఈ పర్యటన, మా చర్చలు రానున్న కాలంలో రెండు దేశాల మధ్య స్నేహపూరిత సంబంధాలకు ఒక వ్యూహాత్మక దిశను అందిస్తాయని నేను విశ్వసిస్తున్నా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచుతాయని నేను నమ్ముతున్నా.” అని మోదీ పేర్కొన్నారు.
 
భారత్ బ్రూనై సంబధాలు యాక్ట్ఈస్ట్ విధానానికి ప్రేరణగా ఉన్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా పేర్కొంది. ‘ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్యం వంటి పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ప్రపంచ సమస్యలపై కూడా తమ అభ్రిపాయాలు పంచుకున్నారు’ అని తెలిపింది.
 
ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి అని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ‘యాక్ట్‌ఈస్ట్‌ విధానంలో భారత్‌కు బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య స్నేహపూరిత బంధాలున్నాయి. బహుళపాక్షిక అంశాలపై పరస్పరం గౌరవం, అవగాహనతో రెండు దేశాలూ ముందుకు వెళ్తున్నాయి’అని పేర్కొంది.
 
ఇక ప్రధాని మోదీ బసచేసిన హోటల్‌ వద్దకు ప్రవాస భారతీయులు వచ్చి ఘన స్వాగతం పలికారు. వారితో కొద్ది సేపు ఆయన ముచ్చటించారు. విద్య, వైద్యం సహా వివిధ రంగాల్లో సేవలందిస్తూ, రెండు దేశాల మధ్య వారధులుగా నిలిచి, బంధాలను బలోపేతం చేస్తున్నారని వారిని కొనియాడారు. తన చిత్రాన్ని బహూకరించిన ఓ చిన్నారికి మోదీ ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. భారత హైకమిషన్‌ నూతన కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్‌ అలీ సైఫుద్దీన్‌ మసీదును సందర్శించారు.