హైజాకర్ల అసలైన పేర్లు స్పష్టంగా తెలిసేలా మార్పు చేశాం!

 
* ‘ఐసీ 814: కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై నెట్‌ఫ్లిక్స్‌ హామీ
 

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఐసీ 814: కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ లోని కొన్ని సన్నివేశాలపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే సిరీస్‌పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది. 

తాజాగా ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ హెడ్‌ మోనికా షెర్గిల్‌ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ సిరీస్‌లో ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఆమె హామీ ఇచ్చినట్లు సమాచారం. పైగా, హైజాక్ చేసిన ఉగ్రవాదుల అసలు పేర్లను సిరీస్ లో చేర్చినట్లు కూడా ఆమె తెలిపారు. దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 

‘‘హైజాకర్ల అసలైన పేర్లు స్పష్టంగా తెలిసేలా స్క్రీన్‌పై క్యాప్షన్లు లేదా రైడర్లు ఎందుకు ఇవ్వలేదు? హైజాకర్లను మానవత్వం ఉన్నవారిగా చూపిస్తూ మధ్యవర్తులను బలహీనపరులుగా, గందరగోళానికి గురవుతున్నవారిగా ఎందుకు చూపించారు?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. 

భవిష్యత్తులో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని నెట్‌ఫ్లిక్స్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. చిన్నారులకు సంబంధించిన కంటెంట్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ పేర్కొంది. “1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ గురించి తెలియని ప్రేక్షకుల ప్రయోజనం కోసం, హైజాకర్ల నిజమైన, కోడ్ పేర్లను ప్రారంభంలోనే జతచేస్తూ  అప్‌డేట్ చేసాము” అని నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ షెర్గిల్ ఒక ప్రకటనలో తెలిపారు.

సమాచార, ప్రసార కార్యదర్శి సంజయ్ జాజుని కలిసిన తర్వాత సిరీస్‌లోని కోడ్ పేర్లు వాస్తవ సంఘటన సమయంలో ఉపయోగించిన వాటిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె చెప్పారు. హైజాకర్ల అసలు పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్. అయితే, ఈ సిరీస్‌లో ఉగ్రవాదులు ఉపయోగించే కోడ్ పేర్ల భోలా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్ అని మాత్రమే చూపారు. 

 “భారతదేశంలో కథలు చెప్పే గొప్ప సంస్కృతి ఉంది.  మేము ఈ కథలను, వాటి ప్రామాణికమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించడానికి కట్టుబడి ఉన్నాము” అని షెర్గిల్ చెప్పారు. కాగా,  కొన్ని విషయాలు సమాజంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఓటిటి ప్లాట్‌ఫారమ్ అవసరం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

“సమస్య ఏమిటంటే, మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ ఆలోచన ఏమిటి?మన ఆలోచన ఏమిటి? కొన్ని విషయాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపగలవు? అని ఒకరినొకరు అర్థం చేసుకోవలసి ఉంది” అని ఆ అధికారి చెప్పారు.

అసలు విషయానికి వస్తే 1999లో భారత విమానాన్ని పాకిస్థాన్‌ ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ ‘ఐసీ 814: కాందహార్ హైజాక్’ . ఈ సిరీస్‌ వెబ్ సిరీస్ ఇటీవలనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇందులోని హైజాకర్ల పేర్లను శంకర్‌, భోలా అని మారు పేర్లతో చూపించడమే కాకుండా, వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించడంపై వివాదం నెలకొంది. 

హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లను పెట్టుకున్నారని, సిరీస్‌ రూపొందించిన వారు దురుద్దేశంతోనే పాత్రలకు మారుపేర్లు పెట్టారని బిజెపి ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది.

అయితే, కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన పుస్తకం ‘ఫ్లైట్‌ ఇన్‌టూ ఫియర్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీనిలో విజయ్‌ వర్మ, నసీరుద్దీన్‌ షా, పంకజ్‌ కపూర్‌, అరవింద స్వామి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 176 మంది ప్రయాణికులతో ఖాట్మాండ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ‘ఐసీ 814’ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు. 

కెప్టెన్‌ తలపై తుపాకీ పెట్టి విమానాన్ని కాబూల్‌ తీసుకెళ్లమని బెదిరిస్తారు. ఆ విమానం కాబూల్‌కు ఎలా చేరింది? ఉగ్రవాదులు ఎందుకు విమానాన్ని హైజాక్‌ చేశారు? వారి డిమాండ్లను నెరవేర్చే క్రమంలో భారత ప్రభుత్వానికి ఏ సమస్యలు ఎదురయ్యాయి? ప్రయాణికులు, విమాన సిబ్బందిని భారత ప్రభుత్వం ఎలా కాపాడింది? అన్న అంశాలతో దీన్ని తెరకెక్కించిన ఈ సిరీస్ ఆగస్టు 29న నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది.