బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్‌ ప్రమాణం

బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్‌ ప్రమాణం
తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తిచేసినట్లు బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వకార్‌-ఉజ్‌-జమా వెల్లడించారు. గురువారం రాత్రి బంగ్లాదేశ్‌ కాలమానం ప్రకారం 8 గంటలకు యూనస్‌ ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో 15 మంది మంత్రులుగా ఉంటారని, వారి నియామకంపై అన్ని రాజకీయ పార్టీల భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులైన నోబెల్‌ గ్రహీత, ఆర్థికవేత్త మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌కు ఇది రెండో విక్టరీ డే. ఈ ఘనతకు కారణమైన విద్యార్థులను, వారి ధైర్యాన్ని అభినందిస్తున్నాను. విద్యార్థుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపిన దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఏమాత్రం తప్పిదాలు చేసినా.. మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. 
 
“తప్పిదాల వల్ల మన విజయాన్ని కోల్పోకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతా హింసను విడనాడి, విధ్వంసాలకు దూరంగా ఉండాలి. శాంతిని నెలకొల్పాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా.. కార్మిక చట్టాల ఉల్లంఘన కింద యూన స్‌పై గతంలో నమోదైన కేసులను లేబర్‌కోర్టు కొట్టివేసిందని ఆయన తరఫు న్యాయవాది అబ్దుల్లా-అల్‌-మామూ వెల్లడించారు. ఫ్రాన్స్‌లో ఉన్న యూనస్‌ బుధవారం సాయంత్రం బంగ్లాదేశ్‌కు తిరిగివచ్చారు. 
 
కాగా, బంగ్లాదేశ్‌ చేరు కున్నాక మహమ్మద్‌ యూనస్‌ నేరుగా అధ్యక్షుడు షహ బుద్దీన్‌ను కలిశారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు గాను 31 మందితో కూడిన జాబితాను ఆయనకు అంద జేశారు. కాగా ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ వకార్‌ మంత్రుల సంఖ్య 15గా ఉంటుందని స్పష్టం చేసిన విషయం తెలి సిందే..! మరోవైపు బంగ్లాదేశ్‌ పరిణామాలపై పాకిస్థాన్‌ స్పందించింది. దేశప్రజల బలమైన స్ఫూర్తి, ఐక్యత ఆ దేశ సామరస్యపూర్వక భవిష్యత్‌కు దారితీస్తుందని విశ్వసిస్తున్నట్లు పాక్‌ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
 
సోమవారం అర్ధరాత్రి షేర్పూర్‌, సత్ఖిరా జైళ్లను ఆందోళనకారులు బద్ధలు కొట్టడంతో.. ఖైదీలు పారిపోయిన విషయం తెలిసిందే..! తాజాగా కుష్తియా జిల్లా జైలు మెయిన్‌గేట్‌ను బద్ధలు కొట్టిన 50 మంది ఖైదీలు.. పారిపోయారని అధికారులు చెప్పారు. గాజీపూర్‌లోని కాశీంపూర్‌ హైసెక్యూరిటీ జైలులో 209 మంది ఖైదీలు పరారయ్యారు. వీరు కొందరు గార్డులను బందీలుగా తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటన జరిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఖైదీలు మరణించారు. సిరాజ్‌గంజ్‌ జైలు నుంచి 150 మంది ఖైదీలు తప్పించుకున్నారని బంగ్లాదేశ్‌ పత్రికలు పేర్కొన్నాయి. అటు చిట్టాగాంగ్‌ జైలులోనూ ఇలాంటి ఘటనే జరిగిందని బుధవారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఘర్షణలు జరిగాయని తెలిపాయి. ఈ ఘటనల నేపథ్యంలో దేశంలోని జైళ్లను సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల హింస, లూటీలు కొనసాగాయి. బుధవారం ఢాకాలో 34 మంది అవామీ కార్యకర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వేల సంఖ్యలో మైనారిటీలు సరిహద్దుల్లో వేచిఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  మరోవైపు.. హసీనా రాజీనామాకు దారి తీసిన కోటా ఉద్యమాన్ని విద్యార్థులే నడిపినా.. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొన్ని విద్యార్థి సంఘాలు సంయుక్తంగా కలిసి.. సమన్వయకర్త నహీద్‌ ఇస్లాం నేతృత్వంలో నెలరోజులపాటు ఉద్యమించాయి. 
 
అయితే.. బుధవారం తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్సిటీలు.. ‘‘విద్యార్థి సంఘాలు ఉండడానికి వీల్లేదు’’ అని ఆదేశాలు జారీ చేశాయి. దీంతో.. చిట్టాగాంగ్‌, ఢాకా సహా.. పలు వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అటు అధ్యాపక సంఘాలు కూడా ఇదేవిధంగా రాజీనామాల బాట పట్టాయి.
 
ఢాకాలోని నయాపల్తాన్‌లో బీఎన్‌పీ బుధవారం భారీ ర్యాలీ నిర్వహించింది.  ఈ సందర్భంగా బీఎన్‌పీ చైర్‌పర్సన్‌, మాజీ ప్రధాని ఖలీదాజియా వీడియో సందేశాన్నిచ్చారు.  విద్యార్థులు, ప్రజలు హింసను వీడాలని ఆమె పిలుపునిచ్చారు. ‘‘విధ్వంసం, ప్రతీకారాన్ని వదిలి.. ప్రేమ, శాంతితో కూడిన సమాజాన్ని నిర్మించుకుందాం. ఈ పోరాటంలో అసువులుబాసిన వందల మంది అమరులకు నా నివాళులు. రక్తం ధారపోసిన యువత కలల సాకారానికి ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ను నిర్మించాల్సిన అవసరం ఉంది’’ అని ఆమె స్పష్టం చేశారు.