రెజ్లర్ వినేష్ అనర్హతపై భారత్ తీవ్ర నిరసన

రెజ్లర్ వినేష్ అనర్హతపై భారత్ తీవ్ర నిరసన

పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్ అనర్హతపై అంతర్జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంట్‌లో తెలిపారు. రెండుసార్లు బరువు కొలిచినప్పుడు ఆమె 50.100 కిలోలుగా తేలిందని క్రీడా మంత్రి తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ వినేష్ ఫోగట్ అంశానికి సంబంధించి భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పిటి ఉషతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారని ఆయన తెలిపారు.

వినేష్ ఫోగట్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించామని ఒలింపిక్ సంఘం తెలిపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.  ఆమె కోసం రూ. 70.45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వినేష్ ఫోగట్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో క్యూబా క్రీడాకారిణి ఓడించి ఫైనల్స్‌కు చేరింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత సుసాకిని ఓడించి చరిత్ర సృష్టించింది.

 ఫైనల్స్‌కు కొన్ని గంటల ముందు ఓ చేదు వార్త బయటకురావడంతో భారతీయులంతా నిరాశ చెందారు. వినేష్ ఫోగట్ బరువు ఎక్కువుగా ఉన్నారని తేలడంతో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేయడంతో విశ్వ క్రీడల నుంచి ఆమె నిష్క్రమించాల్సి వచ్చింది.

రెజ్లింగ్‌లో తలపడే క్రీడాకారులకు ప్రతి రోజు ఉదయం బరువును పరిక్షీస్తారని, ఆ పరీక్షల్లో బరువు అధికంగా ఉన్నట్లు తేలడంతో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి తెలిపారు. 50 కిలోల విభాగంలో ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు చెప్పారు. ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. 

తన బరువును నిరూపించుకోవడంలో విఫలమైనా, బరువు పరీక్షకు ఆటగాడు హాజరుకాకపోయినా అతడిపై అనర్హత వేటు వేయడంతో పాటు ర్యాంకుల జాబితాలో దిగువకు చేరుస్తారని ఒలింపిక్ నిబంధనలు పేర్కొంటున్నాయని, దీని ప్రకారం వినేష్ ఫోగట్ పైనల్స్ ఆడలేకపోతున్నట్లు తెలిపారు.  వినేష్ ఫోగట్‌కు ప్రభుత్వం అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తోందని చెప్పారు. ఆమెకు  క్రీడా సౌకర్యాలు కల్పించడంతో పాటు, అవసరమైన శిక్షణ ఇప్పించినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్‌ కోసం రూ.70,45,775 ఖర్చు చేసినట్లు తెలిపారు.

అయితే, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆమెపై అనర్హత వేటు పడిందని, తక్షణమే దీనిపై విచారణ చేయించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రమంత్రి ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.

వినేశ్ అన‌ర్హ‌త‌పై మేమేం చేయ‌లేం

రూల్ అంటే రూల అంటూ వినేశ్ ఫోగ‌ట్ విష‌యంలో తాము ఏమీ చేయ‌లేం అని వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ చీఫ్ నెన‌డ్ ల‌లోవిక్ కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశాడు. ‘ఒలింపిక్స్‌లో రూల్ అంటే  రూల్. విశ్వ‌క్రీడ‌ల‌ నియ‌మాల‌ను మ‌నంద‌రం గౌర‌వించాలి. అయితే.. భార‌త రెజ్ల‌ర్ విష‌యంలో జ‌రిగిన‌దానికి నాకు చాలా బాధ‌గా ఉంది. ఉండాల్సిన బ‌రువు కంటే ఆమె కొంచెమే ఎక్కువ ఉంది. కానీ, ఎవ‌రికైనా రూల్ ఒక్క‌టే. ఈ విష‌యంలో మేము ఏమీ చేయ‌డానికి లేదు. య‌థావిధిగా పోటీలు కొన‌సాగుతాయి’ అని ల‌లోవిక్ వెల్ల‌డించాడు.
 
బుధ‌వారం ఫైన‌ల్ మ్యాచ్‌ ఇంకొన్ని గంట‌లు ఉంటే వినేశ్ బ‌రువు స‌రిపోయేదని  ఒలింపిక్స్‌కు భార‌త బృందంతో వెళ్లిన వైద్యాధికారి దిన్షా ప‌ర్దివ‌లా తెలిపారు. ఒక్క‌రోజు ఆమెకు 1.5 కేజీ పోష‌కాలు ఇవ్వాల‌ని న్యూట్రిషనిస్టు భావించాడు. సాధారణ ప‌ద్ధ‌తుల్లోనే ఆమె బ‌రువు త‌గ్గుతుంద‌ని ఆయ‌న నమ్మారు. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తూ మంగ‌ళ‌వారం వినేశ్ వ‌రుస‌గా మూడు బౌట్‌(తొలి రౌండ్, క్వార్ట‌ర్స్, సెమీఫైన‌ల్)లలో తల‌ప‌డిన‌ కార‌ణంగా అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు.
 
అనుకోకుండా వినేశ్ 2.7 కిలోల‌ బ‌రువు పెరిగింది. “దాంతో, మేము ఆమెతో రాత్రంత వ్యాయామాలు చేయించాం. ఆమె జుట్టును మ‌రింత‌ క‌త్తిరించాం. రెజ్లింగ్ పోట‌ల‌కు వేసుకొనే డ్రెస్సెను కూడా చిన్న‌గా చేశాం. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా స‌రే.. ఫైన‌ల్‌కు ముందు వినేశ్ 50 కిలోల 100 గ్రాములు తూగింది. దాంతో, నిర్వాహ‌కులు ఆమెను అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. ఒక‌వేళ ఫైన‌ల్‌కు ఇంకొంచెం స‌మ‌యం ఉంటే వినేశ్ ఆ 100 గ్రాములు కూడా త‌గ్గేది. అప్పుడు ఏ అభ్యంత‌రం లేకుండా పోటీప‌డేది’ అని ప‌ర్దివలా వివ‌రించాడు.