హసీనా రాజీనామాకై ఢాకాలో విద్యార్థుల అల్లర్లు… 8 మంది మృతి

హసీనా రాజీనామాకై ఢాకాలో విద్యార్థుల అల్లర్లు… 8 మంది మృతి

బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు మరోసారి వీధుల్లోకి చేరారు. ఆదివారం ఉదయం సెంట్రల్‌ ఢాకా స్క్వేర్‌లోని వేలాది మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులపై పోలీసులను ప్రయోగించిన బంగ్లాదేశ్‌ ప్రధాని షేకహేసీనా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్‌ తరాలు దేశంలో స్వేచ్ఛగా జీవించేందుకు ఈ పోరాటమని నిరసనకారులు పిలుపునిచ్చారు.

శాంతియుతంగా నిరసనలను నిర్వహిస్తామని, అయితే మాపై దాడి చేస్తే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పౌర ఉల్లంఘనోద్యమం చేపట్టాలని స్టూడెంట్స్‌ ఎగైనెస్ట్‌ డిస్క్రిమినేషన్‌ శనివారం పిలుపునిచ్చింది. పన్నులు, సేవల బిల్లులు చెల్లించరాదని, బ్యాంకుల ద్వారా జరిగే విదేశీ చెల్లింపులు నిలిపివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెలోకి రావాలని ఆ గ్రూపు పిలుపిచ్చింది.

ఢాకా నగర శివార్లలో వేలాది మంది నిరసనకారులు, అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది మరణించగా, 20 మందికి పైగా గాయాలయ్యాయి.  స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వారికి ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో జరిగిన హింసాకాండలో సుమారు 200 మంది మృతి చెందారు.

వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, యువజన విభాగం జుబో లీగ్ క్యాడర్ వీధుల్లోకి రావడం వల్ల ఉద్రిక్తత ఏర్పడింది.  ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులను వారు అడ్డుకునేందుకు యత్నించారు.

ఈక్రమంలో ఢాకా శివార్లలోని మున్షిగంజ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా పెట్రోల్ బాంబులు పేలినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఢాకాలోని షాబాగ్ వద్ద వందలాది మంది విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది.

నిరసనకారులతో చర్చలకు తాను సిద్ధమని, వారి కోసం తన కార్యాలయం తలుపులు తెరిచే ఉన్నాయని శనివారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అయితే అందుకు నిరసనకారులకు సారథ్యం వహిస్తున్న నేతలు అంగీకరించలేదు. షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందే అని వారు డిమాండ్ చేశారు.  తమ నిరసనల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు పెద్దసంఖ్యలో నిరసనల్లో పాల్గొంటున్న నేపథ్యంలో దేశంలోని యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌తో హసీనా అత్యవసరంగా సమావేశమయ్యారు. కళాశాలల్లో శాంతిభద్రతల పరిరక్షణ ఏర్పాట్లపై సమీక్షించారు.

పలువురు సైనికాధికారులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆందోళనకు మద్దతుగా మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఇక్బాల్‌ కరీం భుయాన్‌ తన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ చిత్రాన్ని ఎరుపుగా మార్చారు. బంగ్లాదేశ్‌ ప్రజల విశ్వాసానికి సైన్యం చిహ్నమని ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ పేర్కొన్నారు. సైన్యం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని సైన్యం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. అయితే నిరసనలకు సైన్యం మద్దతు ఇస్తుందో లేదో స్పష్టం చేయలేదు.