
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేసి, తద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ చట్టానికి సంబంధించిన మొత్తం 40 సవరణలకు శుక్రవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అధికార వర్గాల ప్రకారం, ఈ సవరణలు ఏదైనా ఆస్తిని “వక్ఫ్ ఆస్తి”గా పేర్కొనడానికి వక్ఫ్ బోర్డు అధికారాన్ని పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
“ప్రతిపాదిత సవరణల ప్రకారం, ఆస్తులపై వక్ఫ్ బోర్డు చేసిన అన్ని క్లెయిమ్‌లు తప్పనిసరి ధృవీకరణకు లోనవుతాయి. వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ఆస్తులకు తప్పనిసరి ధృవీకరణ ప్రక్రియ ప్రతిపాదించబడింది” అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.ఈ సవరణలకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
వక్ఫ్ బోర్డులు సుమారు 940,000 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 870,000 ఆస్తులను పర్యవేక్షిస్తాయి. 2013లో, యుపిఎ ప్రభుత్వం అసలు వక్ఫ్ చట్టం, 1995కి సవరణల ద్వారా ఈ బోర్డుల అధికారాన్ని విస్తృతం కావించింది. అనేక ప్రభుత్వ భూములను తమవే అంటూ వక్ఫ్ బోర్డులు వాదిస్తుండగా అటువంటి ఆస్తులను వెనుకకు తీసుకోవడం ఈ సవరణల కారణంగా ప్రభుత్వాలకు అసాధ్యంగా మారుతుంది.
విరాళంగా సమకూరిన, వక్ఫ్ గా ప్రకటించిన ఆస్తులను ముస్లిం చట్టం పేర్కొన్న పవిత్రమైన, మతపరమైన లేదా ధార్మికమైన ఉద్దేశాలకోసం అంకితభావంతో పనిచేసే వాకీఫ్ ద్వారా నియంత్రించడానికి ఈ చట్టం ఏర్పాటు చేశారు. అయితే యుపిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణల కారణంగా ప్రభుత్వ అధికారాన్ని సవాల్ చేసేవిధంగా మరో అధికార కేంద్రం ఏర్పడినట్లయింది. ఈ అరాచకాన్ని తొలగించేందుకు వక్ఫ్ చట్టంలో సవరణలు తీసుకు రావాలని ప్రభుత్వం 2024 ఎన్నికల ముందే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.
సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యాన్ని కల్పించడం ద్వారా వాటి సమగ్రతను పెంపొందింప చేసేందుకు కూడా రాబోయే సవరణలో నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణలో జిల్లా మేజిస్ట్రేట్‌లను చేర్చాలని ప్రభుత్వం పరిగణించింది.
ఈ బిల్లును పార్లమెంట్ ముందు తీసుకు రాదలచిన ఆగష్టు 5 మోదీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాత్మకమైనది కావడం గమనార్హం. 2019 ఎన్నికల అనంతరం ఇదే రోజున జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఆ మరుసటి సంవత్సరం 2020లో ఇదే రోజున అయోధ్యలో రామజన్మభూమి వద్ద దివ్యమైన మందిరంకు భూమి పూజ జరిగింది.
ఆస్తులను తమవిగా వక్ఫ్ బోర్డు పేర్కొంటున్న వివాదాస్పద భూములపై ప్రభుత్వంకు పరిశీలన జరిపి నిర్ధారించే అధికారం రానున్న సవరణలు కల్పించనున్నాయి. భారత దేశంలో వక్ఫ్ బోర్డులకు ఉన్నట్టు విస్తృత అధికారాలు సౌదీ అరేబియా, ఒమాన్ వంటి ముస్లిం దేశాలలో కూడా లేకపోవడం గమనార్హం. ఈ చట్టానికి సవరణలు చేయాలనీ ముస్లిం మేధావులు, మహిళలు, షియా, బోహ్రా వంటి వర్గాలు చాలాకాలంగా కోరుతున్నాయి.
2014లో ఎన్డీయే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ 123 ప్రధాన ఆస్తులను వక్ఫ్ బోర్డుకు బదిలీ చేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఆస్తులను తిరిగి పొందేందుకు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. ఇంకా, సెప్టెంబరు 2022లో, వక్ఫ్ బోర్డు మొత్తం ఓ గ్రామాన్ని 1100 సంవత్సరాల పురాతన దేవాలయంతో సహా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంది.
తిరుచెంతురై గ్రామంలో హిందువులు మాత్రమే ఉన్నారు. రాజగోపాల్ అనే వ్యక్తి తన భూమిని విక్రయించేందుకు ప్రయత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రాజగోపాల్ తన భూమిని విక్రయించడానికి రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నప్పుడు, అతను విక్రయించాలనుకుంటున్న భూమి తనది కాదని, ఆ భూమిని వక్ఫ్‌గా మార్చారని, ఇప్పుడు దాని యజమాని వక్ఫ్ బోర్డు అని తెలుసుకున్నాడు. ఇది మాత్రమే కాదు, గ్రామస్థులందరి భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
కుంభమేళా విజయవంతం.. సమిష్టి కృషికి నిదర్శనం
నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ