మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై కలకలం 

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై కలకలం 
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఒక్కసారి మంటల చెలరేగి సబ్ కలెక్టరేట్ లోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి, పలు కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం రాత్రి వరకు ఓ ఉద్యోగి సబ్ కలెక్టరేట్ లో ఉండడం, కీలక దస్త్రాలు కాలిపోవడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసర విచారణకు డీజీపీని ఆదేశించారు. ఘటనాస్థలికి హెలికాప్టర్‌లో వెళ్లాలని డిజిపి ద్వారకా తిరుమలరావుకు సీఎం ఆదేశించారు. డీజీపీ, సీఐడీ చీఫ్‌ మదనపల్లెకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. కొత్త సబ్‌ కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, కీలక దస్త్రాలు కాలిపోడవంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపై ప్రాథమిక సమాచారం అందిందని రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు తెలిపారు. వారం కిందట మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరుపై ల్యాండ్ కన్వర్షన్ కు దరఖాస్తు చేశారని, 986 ఎకరాల అసైన్డ్ భూములను పెద్దిరెడ్డి బినామీలకు ఇచ్చారని, వీటిని త్వరలో రద్దు చేయబోతున్నామని వెల్లడించారు. 
 
అగ్ని ప్రమాదంలో దగ్ధమైన కీలక ఫైళ్లలో 90 శాతం కంప్యూటర్ లోనే ఉన్నాయని, దగ్ధమైన ఫైళ్లను రిట్రీవ్ చేస్తామని స్పష్టం చేశారు. ఏఏ ఫైళ్లు దగ్ధమయ్యాయనే అంశంపై ఆరా తీస్తున్నామని చెబుతూ, లా విభాగంలోనూ కొన్ని ఫైళ్లు పోయాయంటున్నారని మంత్రి తెలిపారు. పెద్దిరెడ్డి సతీమణి పేరిట ల్యాండ్ కన్వర్షన్ కు దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను మంత్రి సత్యప్రసాద్ మీడియాకు చూపారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసిందేనని అనిపిస్తోందని స్పష్టం చేశారు.
 
సంఘటనాస్థలిని డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యర్ పరిశీలించారు. సీఐడీ చీఫ్ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్ కారణం కాదని ప్రాథమిక నిర్ధారణలో తేలిందని పోలీసులు అంటున్నారు. కుట్ర కోణంపై డీజీపీ, సీఐడీ చీఫ్‌ ఆరా తీస్తున్నారు.
“ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అగ్ని ప్రమాదంగా అనిపించట్లేదు. ఆర్డిఓ ఆఫీసులో కొద్దిరోజులుగా సీసీ టీవీ కెమెరాలు పని చేయట్లేదని సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ.. ఎందుకో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. స్థానిక సీఐ కూడా ఎస్పీ, డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది” అని డిజిపి తిరుమలరావు చెప్పారు. 
 
కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని విచారణలో తేలిందని వెల్లడించారు. కేసు దర్యాప్తునకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, జిల్లా అదనపు ఎస్పీ రాజకమల్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తున్నామని వివరించారు. ఆఫీసులో ఫైల్స్ అన్నీ ఒకచోట కాకుండా చాలా దూరంగా కాలి పడివున్న తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు.  కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయని, ఇవన్నీ అనుమానాలను మరింత పెంచుతున్నాయని తెలిపారు. 
 
భూముల అవకతవకలు బయటపడతాయనే అనుమానంతో దస్త్రాలు తగలబెట్టారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.  సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఆఫీసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి సమయంలో అతడు అక్కడి ఎందుకు వచ్చాడు?  అతడు వెళ్లిన కాసేపటికే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, అగ్ని ప్రమాదంలో రెవెన్యూ్ రికార్డులు దగ్ధమవ్వడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
ఇప్పటికే గౌతమ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తున్నారు. ఘటనాస్థలిని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్‌ పరిశీలించి, విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల భూఆక్రమణల రికార్డులు మాయం చేసేందుకు అగ్ని ప్రమాదం సృష్టించారని టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వైసీపీ పాలనలో భూఆక్రమణలు జరిగాయని, కొత్త ప్రభుత్వంలో అవి బయటపడతాయనే భయంతో కార్యాలయానికి నిప్పుపెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుంగనూరు, మదనపల్లె ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు దగ్ధమవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.