
నీట్ పరీక్షపై ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా లోక్ సభలో ధర్మేంద్ర మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై సిబిఐ విచారణ జరుగుతోందని, నీట్ పరీక్షలపై వివరాలన్నీ సుప్రీంకోర్టుకు ఇచ్చామని తెలియజేశారు.
గత ఏడు సంవత్సరాల నుంచి నీట్ పేపర్ లీకేజ్ అయినట్లు ఎక్కడ సాక్ష్యాలు లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏదీ దాచిపెట్టడం లేదని, నిజానిజాలను సుప్రీంకోర్టుకు తెలియజేసిందని, ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందని చెప్పారు. కోర్టు ఇచ్చే ఆదేశాల గురించి మనం ఎదురుచూద్దామని సూచించారు.
ఈ ఏడాది మే 5న నీట్-యూజీ పరీక్ష జరిగినప్పుడు పాట్నాలో పేపర్ లీక్ చోటుచేసుకోవడం మినహా గత ఏడేళ్లలో ఎలాంటి పేపర్ లీకేజీలు లేవని గుర్తు చేశారు. ప్రస్తుతం నీట్ పేపర్ లేకేజీ వ్యవహారంపై సీజేఐ నేతృత్వంలో విచారణ జరుగుతున్నందున వాస్తవాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు.
ఎన్‌టీఏ ఏర్పాటు చేసినప్పటి నుంచి 240కి పైగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని, 5 కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4.5 కోట్ల మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. కాగా, నీట్ రగడపై రాహుల్ గాంధీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నీట్ 2024 ప్రశ్నాపత్రాల లీకేజ్ మన విద్యా వ్యవస్ధలో సమస్యలకు సంబంధించి తీవ్ర సమస్యని రాహుల్ పేర్కొన్నారు.
నీట్ ఒక్కటే కాకుండా అన్ని కీలక పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోందని ఆరోపించారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పనితీరు సమీక్షించుకోవడం మాని ప్రతి ఒక్కరినీ నిందిస్తున్నారని విమర్శించారు. అసలేం జరుగుతుందనేది కూడా మంత్రికి అర్ధం కావడం లేదని తనకు అనిపిస్తున్నదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
మన పరీక్షల వ్యవస్ధ లోపభూయిష్టంగా తయారైందనే ఆందోళన దేశవ్యాప్తంగా నెలకొందని తెలిపారు. విద్యా వ్యవస్ధ అంతా మోసపూరితమని లక్షలాది విద్యార్ధులు భావిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బున్నోళ్లు విద్యావ్యవస్థను కొనేస్తున్నారని లక్షలాది మంది ప్రజలు నమ్ముతున్నారని, విపక్షాల అభిప్రాయం కూడా ఇదేనని స్పష్టం చేశారు.
లీకేజీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని చెబుతూ కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా పాసయ్యారని, విద్యాశాఖ మంత్రి (ధర్మేంద్ర ప్రధాన్) ఇక్కడ ఉన్నంతవరకూ విద్యార్థులకు న్యాయం జరగదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
‘నాకు రాజకీయాలు చేయడం ఇష్టం లేదు. అయితే అఖిలేష్ యాదవ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా) ఎన్ని పేపర్ లీక్‌లు జరిగాయో నా దగ్గర జాబితా ఉంది’ అని అంటూ కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా నీట్ అంశంపై సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యలకు కూడా మంత్రి గట్టిగా బదులిచ్చారు. ‘అరిస్తే అబద్ధాలు నిజం కావు.. దేశంలోని పరీక్షా విధానాన్ని చెత్తగా అభివర్ణించారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నేత ప్రకటన మరొకటి ఉండదు.. దీన్ని ఖండిస్తున్నాం’ అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
భారత శ్రామిక శక్తికి కృత్రిమ మేధస్సుతో ముప్పు
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా
అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం