ఇటీవలే ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు యూఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. యూఎస్‌ఏ తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వగా అగ్రరాజ్యంలో క్రికెట్ అభివృద్ధితో పాటు భవిష్యత్‌లో మరిన్ని టోర్నీలను నిర్వహించేందుకు ఈ ఈవెంట్ ఉపయోగపడుతుందని ఐసీసీ భావించింది.
ఇందులో భాగంగానే ఈ టోర్నీలోనే హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌నూ అమెరికాలోనే నిర్వహించింది. కానీ అమెరికాలో మ్యాచ్‌ల మూలంగా ఐసీసీకి 20 మిలియన్‌ల యూఎస్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ. 167 కోట్లు) నష్టం వాటిల్లిందని తెలుస్తున్నది. అమెరికాలో మొత్తంగా 16 మ్యాచ్‌లు జరుగగా న్యూయార్క్‌లో 8, ఫ్లోరిడా, టెక్సాస్‌లో తలా నాలుగు మ్యాచ్‌లను నిర్వహించారు.
గ్రూప్ దశలో భారత్ ఆడిన మ్యాచ్‌లన్నీ ఇక్కడే. దాయాదుల పోరుకు మినహా మిగతా మ్యాచ్‌లన్నింటికీ స్టేడియాలలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకైనా ప్రవాస భారతీయులు వచ్చారు గానీ మిగతా మ్యాచ్‌లకైతే చూద్దామన్నా ప్రేక్షకులు కనిపించలేదు. ఐసీసీకి ఇది భారీ నష్టాన్ని మిగిల్చింది.
ఇదిలాఉండగా దీనిపై శుక్రవారం నుంచి శ్రీలంక వేదికగా జరుగబోయే ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చించనట్టు తెలుస్తోంది. అమెరికాలో టోర్నీ వైఫల్యానికి గల కారణాలపై ఐసీసీ సమీక్షించనుంది. వాస్తవానికి ఈ మీటింగ్‌లో ముందుగా నిర్దేశించిన 9 పాయింట్ల ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ తర్వాత ‘పోస్ట్ ఈవెంట్ రిపోర్ట్’ కింద దీనిని చేర్చినట్టు సమాచారం.
ఐసీసీ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పైనా చర్చించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్‌కు వెళ్లేది లేదని చెబుతున్న నేపథ్యంలో హైబ్రిడ్ మోడల్ సాధ్యమవుతుందా? లేదా? దానికి పాకిస్థాన్ ఒప్పుకుంటుందా? అన్న విషయాలపై చర్చ జరిగే అవకాశముంది. అంతేగాక ఐసీసీ చైర్మన్ బార్క్‌లే పదవీకాలం కూడా త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా ను ఎంపికవుతాడన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
More Stories
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు
రాంగోపాల్ వర్మకు చెక్‌బౌన్స్ కేసులో జైలు శిక్ష!
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!