అవినీతికి పాల్పడిన ఛత్తీస్‌గఢ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్

అవినీతికి పాల్పడిన ఛత్తీస్‌గఢ్‌ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్
ఛత్తీస్‌గఢ్‌లో జ‌రిగిన ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ స్కామ్‌ లో సీబీఐ ద‌ర్యాప్తు మొద‌లుపెట్టింది. 2020-22 సంవ‌త్స‌ర కాలంలో ఆ నాటి పీఎస్సీ చైర్మెన్‌, అధికారులు, రాజ‌కీయ‌వేత్త బంధువులు, కుటుంబ‌స‌భ్యుల‌కు వివిధ జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో ఉద్యోగాలు ఇప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సీజీపీఎస్సీ చైర్‌ప‌ర్స‌న్ త‌మ‌న్ సింగ్ సోన్‌వాని, కార్య‌ద‌ర్శి జేకే ద్రువ్‌ల‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. 
 
బంధుప్రీతితో ఉద్యోగాలు ఇప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మ కుమారులు, కూతుళ్లు, బంధువులను మెరిట్ లిస్టులో ముందు నెట్టి, జిల్లా క‌లెక్ట‌రేట్ల‌లో రిక్రూట్ అయ్యేరీతిలో అవినీతికి పాల్ప‌డిన‌ట్లు చైర్మ‌న్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మ‌న్ సింగ్ సోన‌వాని, ద్రువ్ నివాసాల్లో సోమ‌వారం సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. రాయ్‌పూర్‌తో పాటు బిలాయిలో ఉన్న ఇండ్ల‌ల్లో సోదాలు జ‌రిగాయి.
 
సోనావానీ కుమారుడు నితీశ్‌ను అక్ర‌మ రీతిలో డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ఎంపిక చేశార‌ని సీబీఐ ఆరోపించింది. సోనావానీ సోద‌రిడి కుమారుడు సాహిల్‌ను డిప్యూటీ ఎస్పీ, ఆయ‌న సోద‌రి కుమార్తె సునితా జోషీని లేబ‌ర్ ఆఫీస‌ర్‌గా ఎంపిక చేశారు. మ‌రో బంధువు నిషా కోస‌లే, దీపా అదిల్‌ను జిల్లా అధికారులుగా నియ‌మించ‌డాన్ని సీబీఐ త‌ప్పుప‌ట్టింది. 
 
సీపీఎస్సీ కార్య‌ద‌ర్శి ద్రువ్ కుమారుడు సుమిత్‌ను డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా ఎంపిక చేశార‌ని సీబీఐ ప్ర‌తినిధి ఒక‌రు ఆరోపించారు. సీపీఎస్సీ ప‌రీక్ష ద్వారా 171 మంది ఉద్యోగాలు ఇచ్చార‌ని, దాంట్లో ఆ నాటి ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారుల బంధువులు, ఇంటి స‌భ్యులే మెరిట్ లిస్టులో ఉన్న‌ట్లు సీబీఐ ఆరోపించింది.