ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ ట్రైనింగ్ నిలిపివేత

ఐఏఎస్ పూజా ఖేద్కర్‌ ట్రైనింగ్ నిలిపివేత
వివాదాలకు కేంద్రబిందువుగా మారిన మహారాష్ట్ర ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. ఆమె అడ్డదారుల్లో ఐఏఎస్‌ ఉద్యోగం పొందారంటూ పెద్దఎత్తున ఆరోపణలు రావటం వల్ల ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 
 
పూజా ఖేడ్కర్‌ శిక్షణను నిలిపేసి తిరిగి ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి పూజా ఖేడ్కర్‌ని రిలీవ్‌ చేస్తున్నట్లు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. పూజా ఖేడ్కర్‌ వ్యవహారశైలిపై ఆరోపణలు రావటం వల్ల పుణె నుంచి వాసిమ్కు బదిలీ చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం వెలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఇలా ఉండగా, తన శిక్షణను నిలిపివేస్తూ ఉత్తరువులు జారీఅయిన వెంటనే ఆమె పూణే కలెక్టర్ సుహాస్ దివాసీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. ఈ కలెక్టర్ ఫిర్యాదు ఆధారంగానే మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెను పూణే నుండి వాసింకు బదిలీ చేయడం, ఆ తరవాత ఆమె సివిల్ సర్వీస్ కు ఎంపికపై ఆరోపణలు వెలుగులోకి రావడం జరిగింది.

మరోవైపు పూజాఖేద్కర్‌ సమర్పించిన మెడికల్‌ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీసు విచారణ జరగనుంది. ఈ మేరకు దివ్యాంగుల శాఖ కమిషనర్‌- పుణె పోలీసులతోపాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. నకిలీ పత్రాలతో పూజ దివ్యాంగుల కోటా ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ప్రస్తుతం వాసిమ్ జిల్లాలో పోస్టింగ్‌ పొందిన పూజా ఖేద్కర్‌, యుపిఎస్సికి సమర్పించిన పలు ధ్రువపత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా ఉంది. ఈ సర్టిఫికెట్లను అహ్మద్‌నగర్‌ జిల్లా ఆసుపత్రి మెడికల్‌ బోర్డు జారీ చేసింది. నేత్ర వైకల్య ధ్రువీకరణను 2018, మానసిక వైకల్య ధ్రువీకరణను 2021లో జారీ చేసింది. 

ఆ తర్వాత బోర్డు కంబైన్డ్‌ మెడికల్‌ డిజెబిలిటీ ధ్రువీకరణను అదే సంవత్సరం ఇచ్చినట్లు తెలిసింది. నేత్ర వైద్య సర్జన్‌ డాక్టర్‌ ఎస్‌.వి.రాస్కర్‌ 2018 ఏప్రిల్‌ 25న పూజాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మయోపీ డీజనరేషన్‌ అనే సమస్యతో బాధపడుతోందని, 40శాతం శాశ్వత వైకల్యం ఉందని నిర్ధరించారు. ఇక 2021 జనవరిలో ఆమెను మానసిక వైద్యుడు యోగేష్‌ గడేకర్‌ పరీక్షించి ధ్రువీకరణపత్రం జారీ చేశారు.

సివిల్‌ సర్వీస్‌ పరీక్ష పాసయ్యేందుకు ఆమె నకిలీ దివ్యాంగురాలి సర్టిఫికెట్ సమర్పించడమే కాకుండా ఓబీసీ కోటా వాడుకున్నారని, పోస్టింగ్‌ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  2007లో ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో ప్రవేశం కోసం కూడా నకిలీ ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్ సమర్పించినట్లు తాజాగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమె నాన్‌ క్రిమీలేయర్‌, వైద్య ధ్రువీకరణలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రొబేషన్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.