సిద్దరామయ్య తక్షణమే రాజీనామా చేయాలి

సిద్దరామయ్య తక్షణమే రాజీనామా చేయాలి
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా), కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణాలకు పాల్పడిన  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తక్షణమే రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి, బిజెపి నేత శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు.
 
 సిద్ధరామయ్య రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఈ రెండింటిలో తన ఆదేశానుసారం జరిగిన ఆర్థిక అవకతవకలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నందున, ఈ విషయంలో “న్యాయమైన, నిష్పక్షపాత” విచారణ జరగడానికి సిద్దరామయ్య వెంటనే తన రాజీనామాను సమర్పించాలని ఆమె స్పష్టం చేశారు. 
 
వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ నుంచే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కార్పొరేషన్‌ నుంచి ఆయన (సిద్దరామయ్య) డబ్బులు తీసుకున్నారని, దీనిపై విచారణ జరగాలని ఆమె కోరారు. సిద్ధరామయ్య ఆదేశాల మేరకు వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్‌కు రూ.187 కోట్లు అక్రమంగా బదిలీ చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు.
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిధుల కోసం ఎస్సీ, ఎస్టీలు, పేదలకు చెందిన వారినే ఉపయోగించారని బీజేపీ నేత ధ్వజమెత్తారు. ముడా భూ కుంభకోణంలో కూడా ఆయన ప్రమేయం ఉందని స్పష్టం చేస్తూ సిద్ధరామయ్య భార్యకు 50:50 నిష్పత్తిలో ప్లాట్లు కేటాయించారని ఆమె చెప్పారు. ఆ కుంభకోణాలను కప్పిపుచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
 
నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె స్పష్టం చేశారు. కాగా,  కాంగ్రెస్‌కు, ఆ పార్టీ హైకమాండ్‌కు కర్ణాటక ఏటీఎంగా మారిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆమె ఆరోపించారు.

 సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సిద్ధరామయ్య మైసూర్ అర్భన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా)లో అక్రమంగా 12 స్ధలాలు స్వాహా చేశారని శోభా కరంద్లాజె ఆరోపించారు. 1992లో ముడా కేసరె గ్రామంలో భూ సేకరణ చేపట్టి రూ. 3.81 లక్షల పరిహారం అందించిందని చెప్పారు.  అయితే పార్వతి సిద్ధరామయ్య పరిహారం అంగీకరించలేదని, అప్పట్లో సిద్ధరామయ్య ఆర్ధిక మంత్రిగా ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

1998లో ఆయన ఉపముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలోనూ ఈ వ్యవహారంపై మౌనం దాల్చారని చెప్పారు. 2017లో పరిహారం కోసం సిద్ధరామయ్య ముడాపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.  2022లో నిబంధనలకు విరుద్ధంగా పార్వతి సిద్ధరామయ్యకు కేసరె గ్రామంలో సేకరించిన భూమి నుంచి 14 సైట్లను ముడా కట్టబెట్టిందని చెప్పారు. ఇది చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కేంద్ర మంత్రి ఆరోపించారు.

సిద్ధరామయ్య తాను కూడా లబ్ధిదారుడుగా ఉన్నారని చెప్పారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా కాంగ్రెస్ పెద్దలు కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. సిద్ధరామయ్య ఎప్పుడూ తన కార్యాలయాన్ని లాభదాయక పనులకు వాడుకుంటారని, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నదని ఆమె దుయ్యబట్టారు.