పాలనలో తడబడుతున్న చంద్రబాబు!

పాలనలో తడబడుతున్న చంద్రబాబు!
దేశంలోనే సుదీర్ఘ పాలననుభవం గల కొద్దిమంది నేతలలో ఒకరైన నారా చంద్రబాబునాయుడు గతంలో ఎన్నడూ ఎరుగంతటి ఆధిక్యతతో నాలుగోవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన్నప్పటి నుండి పాలనలో తడబడుతున్నట్లు కనిపిస్తున్నది. గతంలో ప్రదర్శించిన చురుకుదనం ఆయనలో కనిపించడం లేదు.

సీనియర్ అధికారుల పోస్టింగ్ దగ్గర నుండి పధకాల అమలులో ఆయన ముద్ర కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. రిటైర్ అయినా,  వివాదాస్పదమైన ఇద్దరు అధికారుల కనుసన్నలలో పాలన నడుస్తున్నదనే విమర్శలు తలెత్తుకున్నాయి. ప్రత్యామ్న్యాయ అధికార కేంద్రం ఏర్పడినట్లు భావిస్తున్నారు.

జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సీఎం కార్యాలయంలోనే పనిచేస్తుండటం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. సామర్థ్యం పెద్దగా లేని, అవినీతిపరులుగా పేరొందిన అధికారులకు కీలక పదవులు లభిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మరోవంక, ఏపీ కేడర్ కు చెందిన అధికారులను పక్కనపెట్టి కేంద్ర సర్వీసుల నుండి, ఇతర రాష్ట్రాల నుండి అధికారులను డెప్యూటేషన్ పై గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రప్పించి కీలక పదవులు కట్టబెట్టడాన్ని విమర్శించినా టిడిపి నేతలు ఇప్పుడు తమ పాలనలో కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో కీలకంగా వ్యవహరించిన వారిని తిరిగి రప్పిస్తున్నారు. ఇదంతా ఏపీ క్యాడర్ అధికారులను పక్కన పెట్టడమే అవుతుంది.

అధికారం చేపట్టి నెల రోజులు దాటినా నలుగురు మినహా మిగిలిన మంత్రులు ఎవ్వరూ క్రియాశీలకంగా ప్రజల మధ్యకు వెళ్లడం లేదు. నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, నారా లోకేష్, అనిత వంగలపూడి మినహా ఇతర మంత్రులు ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. చంద్రబాబు వరుసగా జారీ చేస్తున్న శ్వేతపత్రాలు సహితం ప్రజలపై చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోతున్నాయి. 

ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా చేసిన విమర్శలను తిరిగి అధికారికంగా ప్రకటించడం మినహా, జగన్ ప్రభుత్వం మోపిన భారాల నుండి ప్రజలకు ఉపశమనం చేసే ప్రయత్నం జరగడం లేదు. కనీసం ఆయా రంగాలలో ప్రభుత్వ కార్యాచరణను సహితం ప్రకటించడం లేదు. సాగునీటి పథకాలలో అవినీతిని ప్రస్తావించిన ఆయన ఆయా కాంట్రాక్టుదారులపై చర్యలకు ఉపక్రమించడం లేదు.

ప్రజలపై భారీ ఎత్తున చార్జీల భారం మోపినదని అంటున్న ముఖ్యమంత్రి వాటిని తగ్గిస్తామని చెప్పడం లేదు. ఆర్ధిక పరమైన పరిమితులు చంద్రబాబును ముందడుగు వేయనీయడంలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వివిధ పధకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిధుల సమీకరణ విషయంలో స్పష్టత లోపిస్తుంది. అందుకనే రెగ్యులర్ బడ్జెట్ ను కాకుండా తాత్కాలిక బడ్జెట్ ను పొడిగించాలని నిర్ణయించినట్లు స్పష్టం అవుతుంది.

ఇక పధకాల అమలులో సహితం ఎన్నికల హామీలకు, అమలుకు పొంతన కుదరడం లేదు. ఒకసారి జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటోండటం, వాటిపై పునఃపరిశీలన చేయాలంటూ అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తోండటం, తనకు తెలియకుండా జీవోలు, గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం చంద్రబాబులో కొత్తగా ఏర్పడిన బేలతనాన్ని వెల్లడి చేస్తోంది.

ఉచిత ఇసుక అని చెప్పి టన్నుకు 1,400 రూపాయల మేర వసూలు చేస్తున్నారు.  ఇంత మొత్తం వైఎస్ జగన్ హయాంలో కూడా లేదు. తల్లికి వందనం కూడా అంతే. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ. 15,000 ఇస్తానంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు చంద్రబాబు. 
 
ఒకరికి అయితే ఎంత? ఇద్దరికి అయితే ఎంత? ముగ్గురికి అయితే ఎంత? మొత్తం అవుతందని లెక్కలేసి మరీ ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే, ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందంటూ స్పష్ష్టం చేస్తున్నారు.  సీపీఎస్, జీపీఎస్ విషయంలోనూ అంతే. తనకు తెలియకుండా ఈ గెజిట్ వెలువడిందంటూ చంద్రబాబు చెప్పడం విస్మయం కలిగిస్తుంది. పాలనాయంత్రంపై ఆయన నియంత్రణ ఉండటం లేదా? అనే అనుమానం కలిగిస్తుంది.