![విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు](https://nijamtoday.com/wp-content/uploads/2024/07/Kumaraswamy-1024x768.jpg)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన గురువారం నాడు సహాయమంత్రి శ్రీనివాస వర్మతో కలిసి స్టీల్ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని చెప్పారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగీకరించిందంటూ ప్రతిపక్ష వైసిపి జరుపుతున్న ప్రచారం నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని పేర్కొంటూ దీన్ని రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర మంత్రి తెలిపారు.
ప్లాంట్ మూతపడుతుందనే ఆందోళన వద్దని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి అన్ని విషయాలు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ అనుమతి తీసుకున్నాక అధికారిక నిర్ణయంతో పాటు ప్రకటన కూడా ఉంటుందని తెలిపారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతూ తనకు 2 నెలలు సమయమివ్వాలని కోరారు.
మరోవైపు ప్లాంట్ సందర్శన అనంతరం కుమారస్వామి అక్కడి విజిటర్స్ డైరీలో తన అభిప్రాయం పంచుకున్నారు. “ఈ స్టీల్ ప్లాంట్ సందర్శించిన తరువాత నాకు ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధి కి సహాయపడుతుంది అని అర్థమైంది. అనేక కుటుంబాలు వారి రోజు వారి అవసరాలు , జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత. ఈ ప్లాంట్ మూతపడుతుంది అని మీరు ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. ప్రధానమంత్రి గారి అశీసులు, సహాయం తో ఈ ప్లాంట్ 100% సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుంది.” అని తెలిపారు.
ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఇప్పట్లో ముందుకెళ్లడం లేదని మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు కుమారస్వామి కూడా ఆందోళన అవసరం లేదని చెప్పడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం తగు సమయంలో నిర్ణయాలు తీసుకుంటుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కార్మికులు, ఉద్యోగుల్లో భరోసా నింపేలా ఉన్నాయని చెప్తున్నారు.
మరోవంక, విశాఖఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు తమ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు జరుగుతున్న దుష్ప్రచారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అబద్దాల ఫ్యాక్టరీ నుంచి ఈ ప్రచారాలు జరుగుతున్నాయని ఉత్తరాంధ్రలో ప్రయత్నిస్తున్న ఆయన మండిపడ్డారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన ఫ్యాక్టరీ … ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఫ్యాక్టరీని వదులుకునేది లేదని స్పష్టం చేశారు. వాజ్‌పాయ్ హయంలో తాను పోరాడి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నామని చెబుతూ ఫ్యాక్టరీని ఎలా కాపాడాలో తమకు తెలుసని చెప్పారు.
More Stories
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!