వైసిపి పాలకులు వీరప్పన్ వారసులు.. ఎర్రచందనం దోచుకున్నారు

వైసిపి పాలకులు వీరప్పన్ వారసులు.. ఎర్రచందనం దోచుకున్నారు
ఏపీలో గత వైసిపి ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసుల‌ని, ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నార‌ని కేంద్రం హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ మండిపడ్డారు. తిరుమ‌లలో శ్రీవారిని గురువారం ఉద‌యం ఆయ‌న ద‌ర్శించుకున్నారు.. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నార‌ని ధ్వజమెత్తారు.
 
శేషాచల అడవుల్లో ఎర్రచందనం దోచేసిన దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీరప్పన్ వారసులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.  శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామ‌ని. దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. 
 
ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, బిజెపి నాయకులు అనేక పోరాటాలు చేశార‌ని గుర్తు చేశారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని బండి సంజయ్‌ తెలిపారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. 
 
స్వామివారిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ఆస్తులు పోగేసిన వారి పాలన పోయి రాష్ట్రంలో సేవకుల పాలన వచ్చిందని తెలిపారు. గత అరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ ఆరోపించారు. కొండ మీద అరాచక పాలన ముగిసింద‌ని పేర్కొన్నారు.

ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న దొంగల పాలన పోయిందని, నిత్యం గోవిందుడి స్మరణ చేసే సేవకుల పాలన వచ్చిందని చెప్పారు. తిరుమల తిరుపతిలో మొన్నటి వరకు నిలువు నామాలు పెట్టుకుని ప్రజలకు పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేశారని మండిపడ్డారు.

ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాడ‌ని చెప్పారు. స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నార‌ని తెలిపారు. ఆయన సారథ్యంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోంది అని బండి సంజయ్‌ భరోసా వ్యక్తం చేశారు.