`కాంగ్రెస్ వ్యతిరేకత’తోనే ముఖ్యమంత్రుల భేటీకి పవన్ కళ్యాణ్ దూరం!

`కాంగ్రెస్ వ్యతిరేకత’తోనే ముఖ్యమంత్రుల భేటీకి పవన్ కళ్యాణ్ దూరం!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ విభజన సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆర్భాటంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో జరిపిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవడం రాజకీయ వర్గాలలో కలకలం రేపుతోంది. ఈ సమావేశం జరిపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ కారణమైనా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ పాల్గొనక పోవడం గమనార్హం.

సమావేశానికి ముందు విడుదల చేసిన రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొనబోయే మంత్రులు, అధికారుల పేర్ల జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. ఆ జాబితాలలో పేర్కొన్న వారిలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే పాల్గొనక పోవడం గమనార్హం. అంటే, ఈ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానం అందినా ఆయన పాల్గొనలేదని స్పష్టం అవుతుంది. 

కాంగ్రెస్ నేతలతో వేదిక పంచుకోవడం పట్ల విముఖతతోనే హాజరు కాలేదని తెలుస్తున్నది. హాజ‌రుకాక‌పోవ‌డంపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతుంది. ఆహ్వానించ‌లేదు అనుకోవ‌డానికి లేదు. ఎందుకంటే సమావేశానికి ముందే స‌మావేశంలో పాల్గొనే వారి జాబితా విడుద‌ల చేశారు. అందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు కూడా ఉంది. అయితే మ‌రెందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌రు కాలేదు? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ప్రధాన కారణం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష శ‌నివారం ముగియనుండటంతో హాజరు కాలేకపోయారని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తే అమ్మవారి వారాహి దీక్ష చేప‌డ‌తాన‌ని మొక్కుకున్నారు. అందులో భాగంగా జూన్ 25న 11 రోజుల అమ్మవారి వారాహి దీక్ష చేప‌ట్టారు. 

ఆ దీక్ష స‌మ‌యంలో ద్రవ ఆహార‌మైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకునేవారు. అయితే ముఖ్యమంత్రుల సమావేశం శనివారం జరగడంతో, కావాలనుకునే దీక్ష ముగించిన తర్వాత పాల్గొనే అవకాశం ఉంది.  దానితో రాజకీయ కారణంతోనే ఆయన హాజరుకాలేదని స్పష్టం అవుతుంది. 

జనసేన పార్టీని ప్రారంభించినప్పటి నుండి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ విధానాలే అవలంభిస్తున్నారు. అందుకనే బీజేపీతో స్నేహంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి సహితం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నే ప్రధాన `రాజకీయ శత్రువు’గా పరిగణిస్తుంది. పార్టీని ప్రారంభించిన సమయంలో ఆయ‌న 2014 మార్చి 14న హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీ స‌మీపంలో నోవాటెల్ హోట‌ల్‌లో నిర్వహించిన జ‌న‌సేన పార్టీ సదస్సులో కాంగ్రెస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. 

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించిన‌ట్లు ప్రక‌టించారు. రెండు గంట‌ల‌కుపైగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌పై విమ‌ర్శలకే అధిక భాగాన్ని ఉప‌యోగించారు. “కాంగ్రెస్ హ‌ఠావో దేశ్ బ‌చావో” అంటూ నిన‌దించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ త‌న వ్యతిరేక‌త‌ను అలానే కొన‌సాగిస్తూ వ‌చ్చారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత జ‌రిగిన‌ 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏపీలో చిత్తుగా ఓడిపోయింది. 

తెలంగాణ‌లో కొన్ని సీట్లు సంపాదించింది. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కాంగ్రెస్ ప‌ట్ల వ్యతిరేకత మాత్రం పోలేదు. ఇటీవ‌లి 2023 డిసెంబ‌ర్‌లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి జ‌న‌సేన పోటీ చేసింది. అయితే జ‌న‌సేన పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అయితే కేవ‌లం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే ఆయ‌న పోటీ చేయించారు.

ఇదే ఎన్నికలలో కేవలం కాంగ్రెస్ కు మేలు చేకూర్చడం కోసమే టిడిపి తెలంగాణాలో పోటీ చేయకపోవడం గమనార్హం. అందుకనే, తాను పార్టీ పెట్టినప్పటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే పార్టీ అక్కడ ఉండ‌టంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు స‌మావేశానికి వెళ్లడానికి ఇష్టం లేద‌ని, అందువ‌ల్లనే ఆయ‌న స‌మావేశానికి హాజ‌రు కాలేద‌ని పలువురు భావిస్తున్నారు.

మరోవంక, గతంలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అందులో కీలకంగా వ్యవహరించి, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న సమయంలో తాను మాత్రం దూరంగా ఉండటం గమనార్హం. ఆ విధంగా కాంగ్రెస్ లో అన్న పార్టీని విలీనం చేయడం పట్ల ఆయన అసహనంగా ఉన్నారనే కధనాలు సహితం అప్పట్లో వచ్చాయి.