గవర్నర్ ఫిర్యాదుతో కోల్‌కతా సీపీ, డీసీపీలపై క్రమశిక్షణ చర్య!

గవర్నర్ ఫిర్యాదుతో కోల్‌కతా సీపీ, డీసీపీలపై క్రమశిక్షణ చర్య!
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ పట్ల అనుచిత వైఖరి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌తోపాటు మరో డీసీపీ ఇందిరా ముఖర్జీలపై కేంద్ర హోంశాఖ క్రమశిక్షణా చర్యకు చర్యలు చేబడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల నాలుగో తేదీన కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభియోగాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్ గా పరిగణించినట్లు తెలుస్తున్నది. వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీల వ్యవహార శైలిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గవర్నర్ సీవీ ఆనంద బోస్ గత నెలాఖరులో నివేదిక సమర్పించారని వినికిడి. 
 
కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, కోల్‌కతా నగర సెంట్రల్ డీసీపీ ఇందిరా ముఖర్జీ పనితీరు ఒక పబ్లిక్ సర్వెంట్‌గా లేదని ఆనంద బోస్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల అనంతర హింస బాధితులు తనను కలుసుకోకుండా అడ్డుకున్నారని వీరిపై ఆనందబోస్ తన నివేదికలో తెలిపారని అధికార వర్గాల కథనం. 
 
ఎన్నికల అనంతర హింస బాధితులను తనను ఎప్పుడైనా కలుసుకోవచ్చునని ఆనంద బోస్ తొలుత అనుమతి ఇచ్చారు. రాజ్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఇతర పోలీసు అధికారులు సైతం గత ఏప్రిల్- మే మధ్య ఒక మహిళా ఉద్యోగిని చేసిన తప్పుడు ఆరోపణల ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆనంద బోస్ ఆరోపించారని ఓ అధికారి చెప్పారు.‘ఇటువంటి ఐపీఎస్ అధికారుల చర్యల వల్ల గవర్నర్ కార్యాలయం ప్రతిష్ట మసక బారుతున్నది. పబ్లిక్ సర్వెంట్ అన్న విషయం పూర్తిగా మరిచిపోయి వ్యవహరిస్తున్నారు. ప్రవర్తనా నియమాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వెనుకాడటం లేదు. రాజ్ భవన్ ఉద్యోగులకు కొత్త గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రోజూ వారిని తనిఖీలు చేస్తున్నారు’ అని ఆనంద బోస్ తన నివేదికలో తేటతెల్లం చేసినట్లు సమాచారం. 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి సారధ్యంలో ఎన్నికల హింస బాధితుల ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవడానికి వచ్చారని, కానీ గవర్నర్ ముందే సువేందు అధికారి, ఇతర ప్రతినిధి బృందాన్ని అరెస్ట్ చేశారని ఓ అధికారి చెప్పారు. దీంతో గవర్నర్ ను కలుసుకునేందుకు ఎన్నికల అనంతర హింస బాధితులు కోర్టును ఆశ్రయించారని సదరు అధికారి వెల్లడించారు.

రాజ్ భవన్ వద్ద పోలీసు కంటింజెంట్ ను తొలగించాలని గత నెల 13న తాను జారీ చేసిన ఆదేశాలపై కోల్ కతా పోలీసు పూర్తిగా నిశ్శబ్దంగా వ్యవహరించిందని, ఇది గవర్నర్ అధికారాలను ధిక్కరించడమే అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  గవర్నర్ అనుమతి లేకుండానే రాజ్ భవన్ ప్రధాన ద్వారం వద్ద గత నెల మధ్యలో సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ లో పని చేసిన మాజీ ఉద్యోగినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు గవర్నర్ పై చేసిన ఆరోపణలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేశారని ఆ అధికారి తెలిపారు.