అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తాను తప్పుకునే ప్రసక్తి లేదని ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా తన కంటే మెరుగైన అభ్యర్థి ఎవరూ లేరని ఆయన తేల్చి చెప్పారు. దేవుడు దిగి వచ్చి చెబితే తప్ప తప్పుకోబోనని కూడా బైడెన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేదీ తానే, ట్రంప్‌ను మళ్లీ ఓడించేదీ తానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బైడెన్ ఈ మేరకు ఎబిసి న్యూస్ టివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 ఎన్నికల సమయంలోనూ తాను ఓడిపోతానని ప్రచారం జరిగిందని బైడెన్ గుర్తు చేశారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టానని, ఇప్పుడు కూడా మరొక సారి ట్రంప్‌పై గెలుస్తానని ఆయన చెప్పారు. మరి నాలుగు సంవత్సరాల పాటు అమెరికన్లకు సేవ చేసే సామర్థ్యం తనకు ఉందని బైడెన్ తెలిపారు.
తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని, తన జ్ఞాపక శక్తి, మానసిక ఆరోగ్యంపై రిపబ్లికన్లు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. మానసికంగా, శారీరకంగా తాను ఫిట్‌గా ఉన్నానని బైడెన్ స్పష్టం చేశారు. తనకు ఎటువంటి వైద్య పరీక్షలూ అవసరం లేదని ఆయన చెప్పారు.
రిపబ్లికన్ల ఆరోపణల నేపథ్యంలో బైడెన్ ఆరోగ్యంపై కొంత మంది ప్రజల్లో అనుమానం తలెత్తిందని యాంకర్ చెబుతూ, అటువంటి వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రైవేట్‌గా వైద్య పరీక్షలు చేయించుకుని, ఫలితాలను జనం ముందు ఉంచే ఆలోచన ఉందా అని అడిగారు. అయితే, అధ్యక్షుడుగా తీరిక లేని పనులతో రోజూ తనకు తానే టెస్ట్‌లు పెట్టుకుంటున్నానని, తనకు మరే ఇతర పరీక్షలూ అవసరం లేదని ఆయన వివరించారు.
రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన తొలి డిబేట్‌లో తడబడడంపై బైడెన్ స్పందించారు. అది ఒక పీడకల అని, నిద్ర లేమి, టైట్ షెడ్యూల్ కారణంగా తాను చాలా అలసిపోవడం వల్ల డిబేట్‌లో సరిగ్గా పాల్గొనలేదని బైడెన్ తెలిపారు. ఒక వైపు డిబేట్ జరుగుతుండగానే నిద్ర ముంచుకు వచ్చిందని, అందుకే ఇకపై రాత్రి 8 గంటల తరువాత ఎటువంటి కార్యక్రమాలనూ చేయరాదని నిర్ణయించుకున్నానని ఆయన వివరించారు.
అధ్యక్ష బరిలో నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతలే కోరుతున్నారన్న ప్రచారంపై బైడెన్ స్పందిస్తూ, పార్టీ నేతలు ఎవరూ తనతో ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు తన కంటే మెరుగైన అభ్యర్థి లేరని ఆయన కుండబద్దలు కొట్టారు. మరి నాలుగు సంవత్సరాల పాటు అమెరికన్లకు సేవలు అందించే శక్తి సామర్థాలు తనకు ఉన్నాయని బైడెన్ చెప్పారు.
More Stories
ఆ కుటుంబం దేశాన్ని పాలించడానికే పుట్టామనుకుంటోంది
జపాన్ ప్రధానిగా మరోసారి షిగేరు ఇషిబా ఎన్నిక
అమెరికా, భారత్ ప్రజాస్వామ్యంలలో విచిత్రాలు