జగన్నాథ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జగన్నాథ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర కనులపండువగా జరుగుతోంది. ఒడిశాతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పూరీ ఆలయానికి తరలివస్తున్నారు. జై జగన్నాథ్, హరిబోల్ నామస్మరణతో పూరీ విధులన్నీ మార్మోగుతున్నాయి. 53 ఏళ్ల తరువాత పూరీ జగన్నాథుడి రథయాత్ర() రెండు రోజులపాటు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున రత్నసింహాసనంపై చతుర్థామూర్తులు కొలువు దీరారు. అనంతరం జగన్నాథుడిని అలంకరించారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాల వల్లభ సేవల తర్వాత 10 గంటలకు నేత్రోత్సవం నిర్వహించారు.

మధ్యాహ్నం 3 గంటలకు పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ రథాలపై చెరాపహరా చేశారు. సాయంత్రం 4 గంటలకు సారథులు, అశ్వాలు అమర్చి తాళ్లు కట్టి 5 గంటలకు బలభధ్రుని తాళధ్వజ రథం లాగారు. తర్వాత దేవీ సుభద్ర దర్పదళన్ అనంతరం పురుషోత్తముని నందిఘోష్‌ రథం తల్లి సన్నిధి వెళ్లింది. యాత్రను విజయవంతం చేయడానికి ఒడిశా సర్కార్ ఘన ఏర్పాట్లు చేసింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు రోజుల పాటు జరిగే జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం పూరి జగన్నాధ్‌ను దర్శించారు. 
ఒడిశాలో ఏటా జరుపుకునే పూరీ రథయాత్రకు రాష్ట్రపతులెవరూ ఇప్పటి వరకు రాలేదు. తొలిసారిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 
 
గవర్నర్‌ రఘుబర్‌దాస్‌తో కలిసి రాష్ట్రపతి సుభద్రమ్మ రథం లాగారు. ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాంఝి, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు రథోత్సవానికి హాజరయ్యారు. కాగా రాష్ట్రపతి స్వరాష్ట్రం ఒడిశానే కావడం విశేషం. పూరీ వీధుల్లో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. మూడంచెల భద్రత నడుమ బలగాలు గస్తీ కాస్తున్నాయి.
 
రాష్ట్రపతికి ఒడిషా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఒడిషా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా పాల్గొన్నారు.  ఇక జగన్నాధ రథయాత్రకు దేశవ్యాప్తంగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. జగన్నాధుడి దర్శించుకుని రథయాత్రలో పాలుపంచుకున్నారు. కాగా, ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పూరి జగన్నాధ రథయాత్ర ఆదివారం ప్రారంభమైంది. 

1971 నుంచి జరుగుతున్న ఈ రథయాత్రను ఈసారి అత్యంత వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు.మోహన్‌ చరణ్‌ మాఝీ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం జగన్నాధ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.

పూరీ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. దేశంలో పూరీ జగన్నాథ రథయాత్ర అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ నగర వీధుల్లో ఊరేగిస్తారు.

ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.