కేవలం ప్రార్థనలతోనే నయం కాని జబ్బులకు సైతం చికిత్స చేసి, ప్రాణాలు పోతున్న వారిని కాపాడుతున్నట్లు ప్రచారం చేస్తున్న తెలంగాణలోని బెల్లంపల్లి కల్వరీ మినిస్ట్రీస్ పై ఫిర్యాదు నమోదైంది. వైద్య విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుచిక్కని విధంగా “మిరాకిల్ హీలింగ్” పేరుతో ఓ చిన్నారిని కాపాడామని చెప్పుకుంటున్న క్రైస్తవ సంస్థపై “లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్” ఫిర్యాదు చేసింది.
కల్వరీ మినిస్ట్రీస్ కు చెందిన పాస్టర్ ఆర్.ప్రవీణ్ కుమార్, ఆయన భార్య షారోన్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సి పి సి ఆర్)తో పాటు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ప్రవీణ్ కుమార్ పేరుతో ఉన్న అధికారిక యూట్యూబ్ ఛానెల్లో మే 16, 2024 న ఒక వీడియో అప్ లోడ్ చేశారు.
అందులో కిడ్నీ చెడిపోయిన బాలిక హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, ఐసీయూలో ఉందని ఆ చిన్నారి తల్లిగా చెప్పబడుతున్న ఓ మహిళ రోదిస్తూ చెబుతోంది. తన కుమార్తె ఆరోగ్యం విషమించిందని, ఆమె బతికేందుకు అవకాశం లేదని వైద్యులు కూడా చెప్పారని, అయితే తన కుమార్తెను కల్వరీ మినిస్ట్రీస్ నిర్వహించిన మిరాకిల్ హీలింగ్ షోకు తీసుకెడితే, . అక్కడ జరిగిన ప్రార్థనలతోనే బతికిందంటూ చెప్పుకొచ్చింది.
ఆ బాలిక ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా వైద్యుల అనుమతి లేకుండా బయటకు తీసుకెళ్లారని తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా.. కిడ్నీ దెబ్బతిని మంచం పట్టి నడవలేని స్థితిలో ఉన్న చిన్నారిని మిరాకిల్ హీలింగ్ కార్యక్రమంలో నడిపించడం చిన్నారి పట్ల ఇది క్రూరమైన స్వభావం అని ఆరోపించింది.
కల్వరి మినిస్ట్రీల కార్యకలాపాలు 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టాన్ని ఉల్లంఘించగలవని ఫోరమ్ ఆరోపించింది. వైద్యుల సలహాలకు విరుద్ధంగా.. బాలికను ఐసీయూ కేర్ నుంచి మిరాకిల్ హీలింగ్ షోకి తరలించడంపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ డీజీపీ, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్‌ను ఆదేశించాలని కోరింది. బాలికను వెంటనే గుర్తించి అవసరమైన వైద్య చికిత్స అందేలా తెలంగాణ ప్రభుత్వానికి సూచించాలని కోరింది.
2003లో బెల్లంపల్లి కేంద్రంగా ఓ ట్రస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసిన ఈ కల్వరీ మినిస్ట్రీపై గతంలో 34 ఐపీసీ సెక్షన్లు 304-II, 420 కింద మే 25, 2019న నమోదైన ఎఫ్ఐఆర్ (నం: 46/2019) ప్రకారం తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేశ్ అనే 21 ఏళ్ల యువకుడిని ప్రార్థన ద్వారా తగ్గిస్తామని చెప్పి, వైద్యం అందించకుండా చేయడంతో ప్రాణాలు కోల్పోవడంపై కేసు కొనసాగుతోంది.

More Stories
230 మందికి మాజీ మావోయిస్టులకు ఎన్ఐఏ నోటీసులు
తరుణ్ కటిక్ హత్యను ఖండిస్తూ క్యాండిల్ మార్చ్
తెలంగాణలో రూ. 894 కోట్ల పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలు