తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు

తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు

బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికలలో పోటీచేసిన దానం నాగేందర్ విషయంలో పిటీషన్ తీసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని,  అసెంబ్లీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా కనపించడం లేదని  బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.  స్పీకర్ కు రిజిస్టర్ పోస్టులో పంపిస్తే , లెటర్స్ ను మళ్ళీ తిరిగి పంపిస్తున్నారని చెప్పారు.

ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో కేసు ఉందని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం పై ప్రజలకు నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. సర్కార్ పెద్దలు, వివిధ ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడితే వాస్తవాలతో సహా బయపెట్టామని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సఫ్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు.

ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్  పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతోందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని రోజులు పంచాయతీల్లో  స్పెషలాఫీసర్ల పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతీకలైన పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 2,000 కోట్లు విడుదల కావడంలేదని తెలిపారు. పంచాయతీ వ్యవస్ధలో ఎన్నికైన స్ధానిక ప్రజా ప్రతినిధులు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని గుర్తు చేశారు.

మరోవంక, ప్రజా పాలన అని గొప్పులు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలోనే ఏడు నెలలుగా పంచాయతీలకు నిధుల్లేవని,  పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవని తెలిపారు. గత్యంతరం లేక వారు కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్తున్నారని చెప్పారు.దీంతో  గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెండు వేల వరకు ఉంటుందని అంచనా.  అవుట్ సోర్సింగ్ గ్రామ కార్యదర్శులే కాదు, రెవెన్యూ, విద్యా శాఖ వంటి ఇతర విభాగాల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రత్యేకించి కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేని ఆయన విచారం వ్యక్తం చేశారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్ పిటీసీ సభ్యులకు ఆరు నెలల గౌరవ వేతనం పెండింగులో ఉందని వాపోతున్నారని చెప్పారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని, వర్క్ ఆర్డర్ తో సర్పంచులు సొంతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు చేపట్టారు. కానీ, కేసిఆర్ సర్కారు ఆపనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పలు సందర్భాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు సర్పంచులు చెబుతున్నారని, ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉందని చెప్పారు. అసెంబ్లీకి ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సర్పంచుల పదవీకాలం ముగిసి ఐదు నెలలైంది. అయినా మాజీ సర్పుంచులు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా విడుదల కావడం లేదని మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

పది శాతం కమిషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. బహుశా ఈ మాజీ సర్పుంచులు పది శాతం కమిషన్లు ఇచ్చుకోలేకపోవడం వల్లే బిల్లులు విడుదల కావడం లేదేమో అనే అనుమానం వ్యక్తం చేశారు.  సర్కార్ పెద్దలకు ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

కాంట్రాక్టర్లకు, మంత్రుల కంపెనీలకు వందల కోట్లు ఇవ్వడానికి నిధులు ఉంటాయి తప్పితే కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. రూ. 4,000కు పెంచుతామన్న పింఛన్ల సంగతీ ఏమోగాని కనీసం ఇప్పుడిస్తున్న రూ. 2వేల పింఛన్ కూడా రెండు నెలలు ఆలస్యంగా ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని నిలదీసేరు. అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.