జమ్ముకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోని భదర్‌వా బనీ రోడ్డులోని చత్తర్‌గల్లా ప్రాంతంలోని ఆర్మీ టెంపరరీ ఆపరేటింగ్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. దొడా, కతువా జిల్లాల్లో మంగళవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మరణించగా, ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
కతువా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పాకిస్థాన్ ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గడిచిన మూడు రోజుల్లో ముష్కరులు కాల్పులు జరపడం ఇది మూడోసారి. దొడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్ రహదారిపై చటర్‌గాలా ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్‌పై ముష్కరమూకలు కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కతువా జిల్లా సైదా సుఖాల్ గ్రామంలో నక్కిన ఉగ్రవాది కోసం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ కబీర్‌దాస్ తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
కథువాలో గత రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని కాల్చివేసినట్లు జమ్మూ జోన్ ఏడీజీపీ ఆనంద్ జెయిన్ తెలిపారు. దోడాలోని చత్తర్‌గాలా ఏరియాలో ఉన్న ఆర్మీ బేస్‌పై గత రాత్రి ఉగ్రవాదులు దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రీయ రైఫిల్స్‌తో పాటు పోలీసులు ఉన్న జాయింట్ పార్టీపై అటాక్ జరిగిందన్నారు. కథువాలో తప్పించుకున్న ఓ ఉగ్రవాదిని అన్వేషించేందుకు అధికారులు డ్రోన్లు వాడుతున్నట్లు తెలిసింది. కథువాలో ఉగ్రవాదులు చొరబడ్డారని, దీనికి పాకిస్థాన్ కారణమని ఆనంద్ జెయిన్ తెలిపారు.
మరోవైపు, మంగళవారం సాయంత్రం కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని జమ్ము జోన్ అడిషనల్ డీజీపీ ఆనంద్ జైన్ తెలిపారు. ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి వెళ్లి తాగునీరు అడగ్గా వెంటనే గ్రామస్థులు తమకు సమాచారమిచ్చారని చెప్పారు. ఓ ఉగ్రవాది బాంబు విసరేందుకు ప్రయత్నించడం వల్ల తమ సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ దాడిలో ఓ పౌరుడు గాయపడ్డినట్లు తెలిపారు. గాలింపు చర్యల్లో భాగంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమైనట్లు చెప్పారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
More Stories
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు- 8 మంది మృతి
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్