
* జనసేన కార్యాలయంకు చంద్రబాబు
ఏపీలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు. మంగళవారం వెలువడ్డ ఎన్నికల్లో ఫలితాల్లో కూటమి ఘన విజయం దిశగా సాగుతుండడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న బాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అభివాదం తెలుపుతూ పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సవాలను జరుపుకున్నారు. భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు, తదితరులతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
కాగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఫోన్ చేసి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ లో ఎన్డిఏ కూటమి ఘన విజయంపై ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్ స్వీప్ చేయడంపై బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్ షా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.
కాగా, ఎన్నికల ఫలితాల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం ప్రకటిస్తూ దేశంలో పోటీ చేసిన ప్రతి చోటా గెలిచిన రికార్డు జనసేనదే అని తెలిపారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్నింటా గెలవడం ప్రజల ఆశీర్వాదం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఎపి ప్రజలు చారిత్రక తీర్పును ఇచ్చారని పేర్కొంటూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.
జగన్ వ్యక్తిగతంగా శత్రువు కాదని స్పష్టం చేశారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాల్సిన సయం అని పవన్ వెల్లడించారు. సీపీఎస్, డీఎస్సీ సహా తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతానని స్పష్టం చేశారు. ఎపికి చీకటి రోజులు ముగిశాయని, జవాబుదారీతనంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఫలితాల అనంతరం జనసేన కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబుకు నసేన అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబుకు కుటుంబ సభ్యులను పవన్ పరిచయం చేశారు. వీరిద్దరూ భేటీ అయ్యారు. వీరి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యచరణ, ప్రమాణ స్వీకారం, మంత్రి మండలి కూర్పు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
More Stories
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో
గుంటూరు ఆసుపత్రిలో జిబిఎస్ తో ఓ మహిళ మృతి
అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత