కన్యాకుమారిలో ప్రధాని మోదీ ‘ధ్యానం’

కన్యాకుమారిలో ప్రధాని మోదీ ‘ధ్యానం’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులూ  ఏమాత్రం విరామం లేకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు. పంజాబ్‌ హోషియార్‌పుర్‌లో తన చివరి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోదీ ధ్యానం చేసుకునేందుకు గురువారం సాయంత్రం కన్యాకుమారికి వెళ్లారు.
 
తెల్లని ధోవతి, శాలువా ధరించిన మోడీ భగవతి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం అమ్మవారిని గర్భాలయంలో దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు అమ్మవారికి ఈ సందర్భంగా ప్రత్యేక హరతి ఇచ్చి ప్రధాని మోదీకి ప్రసాదంగా శౠలువాతోపాటు అమ్మవారి చిత్రపటాన్ని అందచేశారు. 
 
అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ నిర్వహించే ఫెర్రీ సర్వీసులో వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకున్నారు. ధ్యానంలోకి వెళ్లడానికి ముందు మోదీ కొద్ది సేపు ధ్యాన మండపానికి దారితీసే మెట్ల పైన కూర్చుని అద్భుతంగా కనిపించే సముద్ర అందాలను వీక్షించారు. జూన్ 1న ధ్యానం ముగించిన అనంతరం ఇక్కడ నుంచి బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని కన్యాకుమారిలోని తిరువల్లువర్ విగ్రహాన్ని దర్శించనున్నారు.
 
ప్రధాని మోదీ మొత్తం 45 గంటలు కన్యాకుమారిలో గడిపేలా ప్రణాళికలు రచించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలంలో ఆయన స్మారకార్థం రాక్‌మెమోరియల్‌లో మోదీ ధ్యానం చేస్తున్నారు. జూన్‌ 1 వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు.
 
ప్రధాని పర్యటన రీత్యా భద్రతా దళాలు, అధికారులు కన్యాకుమారిలో అన్ని ఏర్పాట్లు చేశారు. 3వేల మందికిపైగా పోలీసులను కన్యాకుమారి, వివేకానందా రాక్‌ మెమోరియల్‌ వద్ద మోహరించారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డుతో పాటు తమిళనాడు తీర రక్షణ దళం రంగంలోకి దిగాయి. 3 రోజుల పాటు చేపలవేటను నిషేధించారు.
 
 మోదీ ఈసారి కన్యాకుమారిని ఎంపిక చేసుకోవడంపై ఆసక్తి నెలకొంది. 1892లో స్వామి వివేకానందా ఇక్కడే 3 పగళ్లు, 3 రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని నమ్ముతారు. యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్‌ సభ్యుడైన మోదీ, వివేకానందాను రోల్‌మోడల్‌గా భావిస్తారు.