గతంలో రెండు సార్లు విమానం టికెట్లను రద్దు చేసుకున్న ప్రజ్వల్ రేవణ్ణ చివరికి గురువారం అర్థరాత్రి లుఫ్తాన్సా ఫ్లైట్ ఎల్‌హెచ్ 0764లో జర్మనీ నుంచి ఇండియాకు తిరిగొచ్చారు. ప్రజ్వల్ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ని బెంగళూరులోని ఓ స్పెషల్ కోర్టు గురువారం కొట్టివేసింది. ఫలితంగా ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోలేకపోయారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు. జేడీఎస్ ప్రముఖ రాజకీయ నేత హెచ్డీ రేవణ్ణ కుమారుడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సోదరుడి కుమారుడు. 2019లో హసన్ సీటు గెలిచిన ప్రజ్వల్ 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ- జేడీఎస్ పొత్తులో భాగంగా అక్కడి నుంచే పోటీ చేశారు.
కాగా, ఎందరో మహిళలను లైంగికంగా వేధించినట్టు ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హసన్ నియోజకవర్గానికి ఏప్రిల్ చివర్లో పోలింగ్ జరగ్గా అందుకు ఒక రోజు ముందు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన వీడియోలతో కూడిన అనేక పెన్‌డ్రైవ్‌లు హసన్‌లో కలకలం సృష్టించాయి.
పోలింగ్ జరిగిన వెంటనే డిప్లొమాటిక్ పస్పోర్ట్ మీద భారత్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారు ప్రజ్వల్ రేవణ్ణ. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణం కేసు అనేక మలుపులు తిరిగింది. ఇక తాను భారత్ కు వస్తానని, మే 31న సిట్ బృందం దర్యాప్తులో పాల్గొంటానని, అధికారులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు ప్రజ్వల్.
చివరికి బెంగళూరు విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి ప్రజ్వల్ రేవణ్ణను విమానాశ్రయం సిబ్బంది పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ప్రజ్వల్ రేవణ్ణను సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కార్యాలయంకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఆయన రాత్రంతా సిట్ బృందం కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకొన్ని గంటల్లో ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కాగా అరెస్ట్ చేసిన 24 గంటల్లో ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ప్రజ్వల్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. అంతేకాదు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు కూడా నేడు వెలువడనుంది.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం