ఓడిపోతామని తెలిసే ఈసీపై ‘ఇండియా’ ఆరోపణలు

ఈ లోక్ సభ ఎన్నికల్లో విపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా బీజేపీ భారీ విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిసి విపక్షాలు ఓటమికి సాకులు వెతుక్కుంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. 

ఈ ఎన్నికల్లో బీజేపీ మతం ఆధారంగా ప్రచారం చేయలేదని, ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఓటర్లకు చెప్పి, యూసీసీ అమలుపై మాట్లాడడం మత ఆధారిత ప్రచారమైతే బీజేపీ అదే చేసిందని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రశ్నలు, రాహుల్ గాంధీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు.

“ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా కొన్ని ప్రశ్నలను లేవనెత్తాయి. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదు. బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా 400సీట్లు దాటుతుంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. పేదల సంక్షేమం, దేశ రక్షణ, ఆర్టికల్ 370 రద్దు, యూసీసీ, మహిళా రిజర్వేషన్, రామ మందిరం వంటి బీజేపీ అజెండాలోని ముఖ్య ఘట్టాలను మోదీ నిజం చేశారు. అందుకే ఆయనపట్ల ప్రజాదరణ పెరిగింది” అని స్పష్టం చేశారు.

ముస్లింల రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని హోమ్  మంత్రి ధ్వజమెత్తారు.  పేదింటి మహిళలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని పేర్కొంటూ అధికారంలోకి రావడానికి ప్రజాకర్షక హామీలు గుప్పించిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని గుర్తు చేశారు. బంగాల్లో బీజేపీ 24-30 సీట్లు, ఒడిశాలో 16-17 సీట్లు సాధిస్తుందని, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 17 స్థానాలను కైవసం చేసుకుంటుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.

‘మోదీ ప్రభుత్వం సాధించిన విజయం’
జమ్ముకశ్మీర్లో వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. జమ్ముకశ్మీర్లో ప్రశాంతంగా పోలింగ్ ముగియడాన్ని మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయంగా అభివర్ణించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు.

“మేము జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేశాం. ఎందుకంటే డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాతే రిజర్వేషన్లు ఇవ్వొచ్చు. జమ్ముకశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తైంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువుకంటే ముందే జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. కశ్మీర్ లోయలో ఓటింగ్ పెరిగింద” అని తెలిపారు. 

“అక్కడి ప్రజలకు భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని కొందరు చెబుతుండేవారు. వేర్పాటువాదులు, పాక్కు మద్దతుగా మాట్లాడేవారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కశ్మీర్ పాలసీకి దక్కిన విజయం” అని అభివర్ణించారు. 

భవిష్యత్లో కశ్మీర్ లోయలో బీజేపీ అభ్యర్థిని పోటీలో నిలుపుతామని చెప్పారు.  పార్టీని బలోపేతం చేస్తున్నామని చెబుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్లో భాగమే అని అమిత్ షా తేల్చి చెప్పారు. పీఓకేను స్వాధీనం చేసుకోవడడమనేది బీజేపీ మ్యానిఫెస్టోలో ఉందని, అంతేకాకుండా పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అందుకు కాంగ్రెస్ కూడా మద్దతుగా ఓటేసిందని అమిత్ షా వివరించారు.

ఈసారి అధికారంలోకి వస్తే అవి అమలు పక్కా!
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తే భాగస్వామ్య పార్టీలతో చర్చించి వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. అలాగే జమిలి ఎన్నికలను కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని అమిత్ షా తెలిపారు.

“రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో ఉమ్మడి పౌరస్మృతి  కూడా ఉంది. కేఎం మున్షీ, బాబు రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ వంటి న్యాయ పండితులు లౌకిక దేశంలో మతం ఆధారంగా చట్టాలు ఉండకూడదని చెప్పారు. జనసంఘ్ కాలం నుంచి మా అజెండాలో యూసీసీ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి వచ్చింది.” అని అమిత్ షా ఇంటర్వ్యూలో తెలిపారు.

దేశంలో నక్సల్స్ సమస్య వచ్చే రెండు మూడేళ్లలో తీరిపోతుందని అమిత్ షా తెలిపారు. ఛత్తీస్‌గఢ్లోని చిన్న ప్రాంతంలో తప్ప యావత్ దేశం నక్సల్స్ నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో 5నెలల క్రితం బీజేపీ సర్కార్ అధికారం చేపట్టడం వల్ల నక్సల్స్పై చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

మణిపుర్ లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అమిత్ షా తెలిపారు. మైతేయి, కుకీ వర్గాల మధ్య ఉన్న వివాదాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ‘ మైతేయి, కుకీ వర్గాల మధ్య జరిగిన ఉద్రిక్తతలు జాతుల మధ్య సమస్య, హింసకు సంబంధించిన సమస్య. దీనిని బలవంతంగా పరిష్కరించలేము. కొన్ని సంఘటనల కారణంగా రెండు వర్గాలు విడిపోయాయి.’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు