విభజన ఒప్పంద కాలం జూన్ 2 తో సమాప్తం

రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన విభజన హామీలకు జూన్‌ 2తో గడువు తీరనుంది. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇక నుండి తెలంగాణకు పరిమితం కానుంది. అక్కడ ఎపికి చెందిన భవనాలనూ తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించనున్నారు.

 వాటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే సాధారణ పరిపాలనశాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గడువు తీరనున్న తేదీ దగ్గరపడుతున్నా 9, 10 షెడ్యూలులోని ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎన్‌టిపిసి, ఎపి భవన్‌, ఆర్‌టిసి, సింగరేణి, ఆస్తులకు సంబంధించిన అంశాలు పూర్తిగా తేల్చలేదు. 

కొన్ని భవనాలను కొలతలు తీసి, సరిహద్దులు నిర్ణయించినా పూర్తి కేటాయింపులు జరగలేదు. రాజధాని అంశాన్ని తేల్చకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు హైదరాబాద్‌, విజయవాడ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇటీవల కొన్ని కార్యాలయాలను కర్నూలులో ఏర్పాటు చేసినా ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత రాలేదు. 

పార్లమెంటు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండో తేదీతోనే విభజన చట్టాన్ని ముగించేస్తారా? లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటయిందాకా ఆగుతారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌ ఉంది. కేసు పెండింగ్‌లో ఉండగా విభజన హామీల అంశాన్ని పూర్తి చేస్తారా? లేక కోర్టు కేసు తేలే వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. 

మరోవైపు ఎపికి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1,200 మంది వరకూ ఉన్నారు. ఇక్కడ నుండి అక్కడకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1,600 మందికిపైగా ఉన్నారు. మూడేళ్ల క్రితం దీనిపై రెండు ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు జరిగాయి. ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల మార్పిడి ఒప్పందం జరుగుతుందని అనుకుంటున్న సమయంలో అక్కడి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీంతో ఆ అంశం పెండింగులో ఉంది.

 విద్యుత్‌ బకాయిలకు సంబంధించి రూ.8 వేల కోట్ల అంశం ఇంకా తేల్చలేదు. దీనిపై సిఎం జగన్‌ గానీ, గత సిఎం చంద్రబాబు గానీ పూర్తిగా తేల్చకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరించారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానితోపాటు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పదేళ్లలో పరిష్కరించుకోవాలి. లేనిపక్షంలో పరస్పర అంశాల వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఇదో పెద్ద సమస్యగా మారింది. 

పెండింగ్‌లో ఉన్న సుమారు ఎనిమిది రంగాలకు సంబంధించిన అంశాలు ఇక నుండి కేంద్ర పర్యవేక్షణలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల అడ్రస్‌ హైదరాబాద్‌గానే ఉంది. సాయంత్రం అక్కడకు వెళ్లడం, ఉదయం ఇక్కడకు రావడం పనిగా పెట్టుకున్నారు. వ్యాపార లావాదేవీలు, కంపెనీల అడ్రస్‌లన్నీ హైదరాబాద్‌ కేంద్రంగానే నడుస్తున్నాయి. 

కుటుంబాలు, పిల్లల చదువులు అన్నీ దాంతోనే ముడిపడి ఉన్నాయి. జూన్‌ రెండు లేదా కొత్త ప్రభుత్వం వచ్చి పార్లమెంటు చేసిన ఒప్పందం ప్రకారం నిర్ణయం తీసుకుని హైదరాబాద్‌ను తెలంగాణకు అప్పగించేస్తే ఇప్పుడు ఎపిలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల అడ్రస్‌లన్నీ వేరే రాష్ట్రంలోనే ఉండనున్నాయి. జూన్‌ రెండు తరువాత ఇదే కీలక అంశంగా ముందుకు రానుంది.