ధాన్యం అక్రమాలపై రేవంత్ తేల్చకపోతే సీబీఐ దర్యాప్తు కోరతాం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం కొనుగోలు, రేషన్ సరుకుల సరఫరాలో చాలా అవకతవకలు జరిగాయని మరోసారి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాను ఆధారాలతో సహా బయటపెట్టినా సంబంధిత శాఖ మంత్రి మౌనంగా ఉండటమంటే..అక్రమాలు జరిగాయని ఒప్పుకున్నట్లేనని తెలిపారు. అందుకే వాస్తవాలు తేల్చాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని తెలిపారు. 
 

ఈ సందర్భంగా సీఎం కు రాసిన లేఖను మీడియా సమావేశంలో విడుదల చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సివిల్ సఫ్లై శాఖలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి మరిన్ని ఆధారాలను బయటపెట్టాలి.

తాను చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను తేల్చాలని కోరారు. పేదలకు పిడిఎస్ ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే నాణ్యమైన రేషన్ బియ్యం, ధాన్యం కొనుగోలు, గన్నీబ్యాగులు, ఇలా అనేక విషయాల్లో వేల కోట్ల నిధులు కేంద్రం సాయం అందిస్తోందని, అలాంటి నిధులను దుర్వినియోగం చేసేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తామని స్పస్టం చేశారు.

తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పుకుండా సంబంధిత శాఖ మంత్రి ముఖం చాటేశారని, అధికారులతో ప్రెస్ మీట్లు పెట్టించి చట్టపరమైర చర్యలంటూ కార్యకర్తలతో కేసులు పెట్టిస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీజేపీ పార్టీ, బీజేపీ నేతలు ఎప్పుడు భయపడరని హెచ్చరించారు.

ఓ రైతు బిడ్డగ, బీజేపీ శాసనసభాపక్షనేతగా, ప్రజల గొంతుకై ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం తప్పా? అని ప్రశ్నించారు. అందుకే తెలంగాణ ప్రజల తరపున ప్రభుత్వానికి 19 ప్రశ్నలను సంధిస్తున్నానని పేర్కొంటూ ముందు వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1.   నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌రైన టైముకు కస్ట‌మ్ మిల్లింగ్ రైసును ఇవ్వ‌కపోవ‌డంతో, డిఫాల్ట‌ర్ల జాబితాలో చేరిన మిల్ల‌ర్ల‌ లిస్ట్ బయటపెట్టండి. కొంద‌రు మిల్ల‌ర్ల‌పైనే చ‌ర్య‌లు తీసుకుని, మిగిలిన వారికే ఈ సీజ‌నులో ధాన్యాన్ని లెవీ కోసం ఇవ్వ‌డం వెన‌క మ‌త‌ల‌బేంటి.?

2.అనేక జిల్లాలో రైసు మిల్లులు నడవకున్న (ఆపరేషన్ లో లేకున్నా) ..ఉన్నట్లు చూపించడం వాస్తవం కాదా? … మిల్లులు ఉంటే, దానికి సంబంధించిన కరెంట్ బిల్లులు, అందులో ప‌ని చేస్తున్న సిబ్బంది వివ‌రాలు ఉండాలి కదా … ఆ బోగస్ మిల్లుల్లో స్టాక్ లేకున్నా…సిఎంఆర్ ఇవ్వ‌కుండా…రీ సైక్లింగ్ రైస్ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుక‌ని? నాలుగైదేళ్లుగా సిఎంఆర్ నిల్వ‌ల‌పై ఆడిట్ జ‌ర‌గ‌ని విష‌యం వాస్త‌వం కాదా..?

3.రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, నల్గొండ, యాదాద్రి, జగిత్యాల జిల్లాల్లో ఎంద‌రో మిల్లర్ల దగ్గర మీరిచ్చిన స్టాక్ లేకపోయినా … వారిపై చర్యలు తీసుకోకుండా కాపాడటంలో ఉన్న ఆంతర్యం ఏంటీ…  ఇందుకోసం వారి దగ్గర అనేక కోట్ల రూపాయాలు చేతులు మారుతున్న సమాచారం వాస్త‌వం కాదా?

4.స‌రైన టైముకు సిఎంఆర్ ఇవ్వ‌కుండా మోసాల‌కు పాల్ప‌డిన ఎంత మంది మిల్లర్లపై రెవెన్యూ రిక‌వ‌రీ యాక్టు ప్ర‌కారం క్రిమినల్ కేసులు న‌మోదు చేసారు?  అంద‌రిపై ఎందుకు కేసులు పెట్టలేదు … రెవెన్యూ రిక‌వ‌రీ చ‌ట్టం నుంచి కూడా త‌ప్పించుకునేలా మిల్ల‌ర్లు  వేస్తున్న‌ ఎత్తుగ‌డ‌లకు కౌంట‌రుగా ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటోంది?

5.మిల్ల‌ర్లు స‌కాలంలో క‌స్ట‌మ్ మిల్లింగ్ రైసు ఇవ్వ‌కుండా తీరిగ్గా ఏడాది త‌ర్వాత పిడిఎస్ బియ్యాన్ని కిలో ప‌ది రూపాయ‌ల‌కు కొనుగోలు చేసి, వాటిని సిఎంఆర్ గా రీసైక్లింగ్ చేస్తున్న‌ది వాస్త‌వం కాదా? ఇలా మిల్ల‌ర్లు ప్ర‌భుత్వాన్ని మోసం చేస్తూ  పాల్ప‌డుతున్న కుంభ‌కోణం ఎన్ని వేల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా?

6.కొంద‌రు మిల్ల‌ర్లు ఇలా అప్పగిస్తున్న సీఎంఆర్‌ బియ్యం, పి.డి.ఎస్‌ రీసైక్లింగ్‌ బియ్యం కాదని చెప్పే నైపుణ్యత, టెక్నాలజీ సివిల్‌ సప్లయీస్ అధికారుల వద్ద ఉన్నదా? రేషన్ షాపులలో ఇప్పుడు బియ్యం ఇవ్వకుండా దానికి బదులుగా వినియోగ‌దారుల‌కు కిలోకు 10 రూపాయాల చొప్పున ఇచ్చి డీలర్స్ చేతులు దులుపుకుంటున్నది వాస్త‌వం కాదా … కొన్ని చోట్ల‌ బియ్యం స్టాక్ లేకుంటే బియ్యానికి బదులు ఏదైన బరువు పెట్టి థంబ్ యాక్సిస్ చేస్తున్నది వాస్త‌వం కాదా.

7.మిల్ల‌ర్లు చేస్తున్న ఈ మోసాల వ‌ల్ల సివిల్ స‌ప్ల‌యీస్ శాఖ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత న‌ష్టం వ‌చ్చింది? సివిల్ స‌ప్ల‌యీస్ శాఖ ప్ర‌స్తుతం ఎంత మేర‌కు అప్పుల్లో ఉంది?… ఎటా ఎంత మేర వ‌డ్డీలు చెల్లిస్తోంది?

8.రైసు మిల్ల‌ర్ల వ‌ద్ద పెండింగులో ఉన్న‌ ధాన్యాన్ని విక్ర‌యించేందుకు జారీ చేయాల్సిన టెండ‌ర్ల కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు 25 జ‌న‌వ‌రి 2024 రోజున జి.ఓ. ఎంస్ నంబ‌ర్ 01. ప్ర‌కారం, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఛైర్మ‌న్ గా ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ వేశారు క‌దా, మరి అదే రోజు గైడ్ లైన్స్ డిటేల్డ్ నోటీస్ ఎలా ప్రిపేర్ చేశారు…అదే రోజున గ్లోబ‌ల్ టెండ‌ర్లు ఎలా జారీ చేశారు.

9.మ‌రో వైపు రాష్ట్ర ప్రభుత్వం 23-02-2024 రోజన కేంద్ర ప్రభుత్వానికి క‌స్ట‌మ్ మిల్లింగ్ రైస్ డెలీవరీకి గడువు కోరుతూ లేఖ రాసింది. దీనికి కేంద్రం స్పందించి, మే 15 వరకు గడువు ఇస్తున్నట్లు మార్చి 01న లేఖ పంపంది క‌దా. తెలంగాణకు ప్రత్యేకంగా మే 15 వరకు కేంద్రం గడువు ఇచ్చినా…రాష్ట్ర ప్రభుత్వం ఇదే బియ్యానికి సంబంధించిన వ‌రి ధాన్యానికి 2024 జనవరి 25న టెండర్లు ఖరారు చేయ‌డం వెనుక మతలబేంటి. హడావుడిగా ఒకే రోజులో కమిటీ ఏర్పాటు, గైడ్ లైన్స్ రూపకల్పన, టెండర్లు ఇచ్చేసి, ఫిబ్రవరిలో గడువు పెంచాలని కేంద్రానికి లేఖ రాయడం ఎందుకు. ఇందులో ఏదో గోల్ మాల్ ఉందనే విషయం అందరికీ అర్థమవుతోంది క‌దా..?

10.ఏప్రిల్ 18న కొంద‌రు రైస్ మిల్ల‌ర్ల‌తో జ‌ల‌సౌధ‌లో పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి, క‌మిష‌న‌ర్ మాట్లాడిన అంశాలేంటి. ఆ రోజు మీరు గ్లోబ‌ల్ టెండ‌ర్స్ అని చెప్పితే, అందులో పాల్గొందామ‌ని పంజాబ్, హ‌ర్యానా నుంచి వ‌చ్చిన కొంద‌రు ట్రేడ‌ర్లును, లోక‌ల్ జి.ఎస్.టి రిజిస్ట్రేష‌న్, ఆఫీస్ హైద‌రాబాద్ లో ఉండాల‌ని కండిష‌న్ పెట్టి తిర‌స్క‌రించలేదా…  జ‌ల‌సౌధ‌లో జ‌రిగిన మీటింగులో బ‌గాడియా రైస్ ఎక్స్ పోర్ట‌ర్స్, గురునాన‌క్  రైస్ అండ్ జ‌న‌ర‌ల్ మిల్స్ వంటి కంపెనీలు టెండ‌రులో పాల్గొనే అవ‌కాశం త‌మ‌కు కూడా ఇవ్వాల‌ని కోరిన మాట వాస్త‌వం కాదా..? ఇలా మీర‌నుకున్న వారికే ఈ టెండర్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా…?

11.ఆ రోజున క‌మిష‌న‌రు … తాను డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స్ధాయి పోలీస్ ఆఫీస‌రును అని ట్రేడ‌ర్ల‌ను భ‌య‌పెట్ట లేదా ? వేరే రాష్ట్ర ట్రేడ‌ర్ల‌ను త‌ప్పించి మీర‌నుకున్న వారికి టెండ‌ర్లు క‌ట్టబెట్టారు. ఆ రోజు టెండ‌ర్ రేటు క్వింటాలు ధాన్యానికి రూ.2007 గా ఖ‌రారైంది క‌దా… ఈ రేటును రూ. 2223 కు పెంచి, అంటే రూ. 216 అద‌నంగా ప్ర‌తి క్వింటాలుకు ఇవ్వాల‌ని మీరు డిమాండ్ చేసింది వాస్త‌వం కాదా…? దాని కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నది వాస్తవం కాదా..? దాంతో రైసు మిల్ల‌ర్ల అసోసియేష‌న్ నేత‌లు భ‌య‌ప‌డి మీరు ఖ‌రారు చేసిన మొత్తానికి అంగీక‌రించింది వాస్త‌వం కాదా …. ఇలా మిల్ల‌ర్ల‌ను భ‌య‌పెట్టి కేసులు పెడ‌తామంటూ అరాచ‌కం చేసింది వాస్త‌వం కాదా ..?

12.ధాన్యం టెండ‌ర్లు ద‌క్కించుకున్న బిడ్డర్లను మధ్యలో పెట్టి మిల్లర్లతో వసూలు దందా చేస్తున్నది వాస్త‌వం కాదా … బిడ్డర్ల కలెక్షన్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, కానీ మిల్లర్ల దగ్గర వసూళ్ల కోసం టాస్క్ ఫోర్స్ ను అడ్డంపెట్టుకుని భయపెడుతున్నది వాస్త‌వం కాదా …కోట్లాది రూపాయాలు చేతులు మారిన సంగతీ వాస్తవం కాదా…?

13. ఏప్రిల్ 18నాడు జలసౌధాలో మీరు అపాయింట్ చేసిన కాంట్రాక్టర్లతో వంద రూపాయాల స్టాంప్ పేపర్ పై ఎంవోయూ చేయించి, మిల్లర్లతో బలవంతగా అగ్రిమెంట్ క్వింటాకు 2007గా ఉన్న బిడ్ ధరను రూ.2223కు పెంచి, అదనంగా రూ.216 కు అగ్రిమెంట్ చేయించిన మాట వాస్తవం కాదా..అంటే 35 లక్షల మెట్రిక్ టన్నులకు 216 రూపాయాల చొప్పున దాదాపు 800 కోట్ల రూపాయాలు అదనంగా వసూళ్ల మాట వాస్తవం కాదా. ఇవి ఎవరి ఖాతాలోకి వెళ్లాయి.

14.టెండ‌ర్లు ద‌క్కించుకున్న బిడ్డ‌ర్లు 68 రోజులైనా  ధాన్యాన్ని లిఫ్టు చేయ‌లేదని ఏప్రిల్ 30న వారికి నోటీసు ఇచ్చారు క‌దా, టెండ‌ర్ల నిబంధ‌న‌ల‌ ప్రకారం బిడ్డ‌ర్లు 23 మే 2024 లోప‌ల మెటీరియ‌ల్ ను లిఫ్టు చేయాలి. మ‌రి గడువు ముగిసింది కదా…మెటీరియ‌ల్ లిఫ్టు చేయ‌కుంటే టెండర్ నిబంధన ప్రకారం వారికిచ్చిన కాంట్రాక్ట్ ని రద్దు చేసి ఈఎండీని ఫోర్ ఫిట్ చేస్తామని ప్ర‌భుత్వం చెప్పింది క‌దా. మ‌రి చేసిందా.

15. మ‌రో అంశం స‌న్న బియ్యంలో కూడా స్కామ్ జ‌రిగింది. స‌న్న ర‌కం వ‌రి ధాన్యం 2022 – 23 స్టాక్ ను కాంగ్రెస్ స‌ర్కారు క్వింటాలుకు రూ.2259/- చొప్పున ల‌క్షా 59 వేల ట‌న్నుల ధాన్యాన్ని అమ్మేసింది. అంటే సీఎంఆర్ కింద బియ్యం తీసుకుంటే ప్రభుత్వానికి లక్షా 59వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే  లక్షా ఆరు వేల 530 మెట్రిక్ టన్నుల బియ్యం వ‌చ్చేవి క‌దా. అంటే స‌న్న బియ్యం క్వింటాలుకు రూ.3500/- లోపే ల‌భించేవి. ఈ బియ్యం కనీసం నాలుగైదు నెలలు మనకు సరిపోయేవి. ఈ సీజన్ లో సేకరించిన స‌న్న వ‌డ్ల ద్వారా కూడా రేపుఅవ‌స‌ర‌మైన స‌న్న బియ్యాన్ని మిల్లింగు చేసుకునే వీలుండేది క‌దా.

16. ఇలా అందుబాటులో ఉన్న ఈ ధాన్యం వ‌న‌రుల‌ను వాడుకోకుండా, ఇపుడు విద్యార్ధుల‌కు స‌న్న బియ్యం భోజ‌నం పేరుతో రెండు ల‌క్ష‌ల 20 వేల ట‌న్నుల స‌న్న బియ్యాన్ని ప‌ది శాతం నూక‌లు ఉన్న‌వి, క్వింటాలుకు రూ.5700/- చొప్పున కొనుగోలు ఎందుకు చేస్తున్నారు. అంత స్టాక్ ను నిల్వ చేయడానికి మనకు సరిపోను గోడౌన్స్ ఉన్నాయా..? ఎందుకు స‌న్న ర‌కం ధాన్యాన్ని రూ.2259/- చొప్పున అమ్మారు, ఎందుక‌ని ఇప్పుడు స‌న్న బియ్యాన్నిక్వింటాలుకు రూ.5700/- పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

17. ప్రస్తుతం ఓపెన్ మార్కెటులో స‌న్న బియ్యం కిలో రూ. 40 నుంచి రూ.42 కి మించి లేదు. మ‌రి రూ.15 అద‌నంగా చెల్లించి కిలో రూ.57కు  కొనుగోలు చేయ‌డం వెన‌క మ‌త‌ల‌బు అవినీతి కాదా…గతంలో సన్న బియ్యం కోసం ఏ టెండర్ ఇంత ధర ఇవ్వలేదు, కిలో రూ.35 నుంచి రూ.37 కే కొనుగోలు చేసేవారు.

18.  ఇప్పుడు ఏకంగా కిలో రూ.57కు కొనుగోలు చేశారు.  అంటే ఒక క్వింటాకు రూ.1500 అదనంగా చెల్లిస్తూ, 22 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని కోనుగోలు చేయ‌డం వ‌ల్ల‌ మొత్తం రూ. 350 కోట్ల పై మాటే ఈ ప్ర‌భుత్వంపై అద‌న‌పు భారం ప‌డ‌లేదా… ఇది కుంభకోణం కాదా.?

19.పేదలకు పిడిఎస్ ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే నాణ్యమైన రేషన్ బియ్యం పథకానికి నిధులు సమకూరుస్తున్నది కేంద్ర ప్రభుత్వమన్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రం పేదల కోసం వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బియ్యం రీసైక్లింగ్ ను అరికట్టకుండా  దుర్వినియోగం చేస్తోందనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నది వాస్తవం కాదా…. ఈ విషయాన్ని సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. వేల కోట్ల  కేంద్ర నిధులను దుర్వినియోగం చేసేలా తెలంగాణ పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తాను.