గేమింగ్‌ జోన్‌లో అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనం

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్‌పీ గేమింగ్‌ జోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 27 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  కాగా, మృతుల్లో 12 మంది చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. లోపల మరింత మంది చిక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 
 
కాగా, పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చినప్పటికీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ ఆర్‌ఏ జోబన్‌ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని పేర్కొన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని చెప్పారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మంటల్లో చిక్కుకున్న కొందరిని కాపాడారు పోలీసులు. వేసవి సెలవుల కారణంగా గేమ్​జోన్​లో ఘటనా సమయంలో చాలా మంది పిల్లలు ఉన్నారు. “పిల్లలతో సహా 16 మంది మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని రాజ్‌కోట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధవల్ హరిపరా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.

ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటనపై గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు రూ 4 లక్షల సహాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులంతా తక్షణమే ఘటనా స్థలికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తామని రాజ్‌కోట్‌ పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ్‌ తెలిపారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.

గేమింగ్ జోన్ మేనేజర్, యజమానిలతో సహా ముగ్గురిని గుజరాత్  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు సిఐడి అదనపు డిజిపి సుభాష్ త్రివేది నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. మరోవంక రాష్ట్రంలోని అన్ని గేమింగ్ జోన్ లలో వెంటనే తనిఖీలు చేపట్టి అగ్నిప్రమాదాల నుండి తగు భద్రతలు పాటించని వాటిని మూసేయించామని గుజరాత్ డిజిపి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.