దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర

గోవాపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారంటూ దక్షిణ గోవా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరీయటో ఫెర్నాండెజ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ మండిపడ్డారు. 
 
పోర్చుగీస్ నుంచి విముక్తి పొందిన తర్వాత ఎవరితో ఉండాలో గోవా నిర్ణయించుకుంటుందని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చెప్పారని, అయితే అది ఎప్పటికీ నోచుకోలేదని, రాష్ట్రంపై భారత రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని ఫెర్నాండెజ్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ స్పందించారు. 
 
స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజు నుంచే బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టుందని, దేశానికి చెందిన ఎంతో భూభాగాన్ని వదులుకుందని ఆరోపించారు. ఆ కారణంగానే చిన్న చిన్న ద్వీపాలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కోరుకుంటోందని దుయ్యబట్టారు. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వారు అధికారంలో పాలుపంచుకోవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకుందని, ఇప్పుడు మరో పెద్ద ఆటకు తెరలేపిందని ప్రధాని ఆరోపియన్చారు.
 
దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఇంతకముందు కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారని, ఇప్పుడు గోవాకు చెందిన కాంగ్రెస్ నేత గోవాకు భారత రాజ్యాంగం వర్తించదని చెబుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఇది బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అవమానించడం కాదా? రాజ్యాంగానికి జరుగుతున్న అవమానం కాదా? భారత రాజ్యాంగాన్ని ట్యాంపరింగ్ చేయడం కాదా? అని ప్రశ్నించారు. 
 
రాహుల్ గాంధీ మొప్పుకోసమే గోవా కాంగ్రెస్ అభ్యర్థి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అనుకోవాల్సి వస్తోందని ప్రధాని ధ్వజమెత్తారు. ఈరోజు గోవాలో రాజ్యాంగాన్ని తోసిపుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు యావద్దేశం విషయంలో ఇలాంటి పాపానికి ఒడిగట్టదని చెప్పలేమని హెచ్చరించారు. బుజ్జగింపు రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు కాంగ్రెస్ డీఎన్ఏ‌లోనే ఉన్నాయని ప్రధాని తప్పుపట్టారు.
 
‘2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీతో మాట్లాడా. గోవా ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వడంపై ఆయనతో చర్చించా. 1961లో గోవాకు విముక్తి లభించగానే, గోవా ప్రజలపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని చెప్పా. పోర్చుగీసుల నుంచి విముక్తి లభించిన తర్వాత వారి (గోవా ప్రజలు) తలరాత వారే నిర్ణయించుకొంటారని మాజీ ప్రధాని నెహ్రూ చెప్పినట్టు గుర్తు చేశా. అయితే, మా తలరాతను వేరొకరు రాశారని తెలిపా’ అని విరియాటో ఫెర్నాండెజ్‌  దక్షిణ గోవాలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
 
విభజన రాజకీయాలను కాంగ్రెస్‌ ఇకనైనా మానుకోవాలని గోవా ముఖ్యమంత్రి సావంత్‌ సోషల్‌మీడియాలో విరుచుకుపడ్డారు. ఇలా ఉండగా, కాంగ్రెస్‌కు, అభివృద్ధికి రెండిటికీ పొసగదని, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి, హింస పతాక స్థాయికి చేరుతాయని  ప్రధాని మోదీ ఆరోపించారు. శఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు హింసాత్మక కార్యకలాపాలను అదుపు చేయలేకపోయిందని, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్నన్ని రోజులు నక్సలిజం పెరుగుతూనే ఉందని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్‌కు, హింసకు సంబంధం ఏమిటని ప్రశ్నించిన ఆయన అవినీతి అంటూ తానే సమాధానమిచ్చారు.

తన అవినీతిని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ హింసను రెచ్చగొట్టేదని, ప్రజలు చస్తూ ఉంటే కాంగ్రెస్ తన కజానాను నింపుకుంటూ ఉండేదని ఆయన ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజనం వేగంగా తగ్గుతోందని, ఇక్కడి బిజెపి ప్రభుత్వం అవినీతిని, మావోయిజాన్ని అదుపులోకి తెచ్చిందని మోదీ  తెలిపారు.  నక్సలిజాన్ని రూపుమాపుతానని తల్లిదండ్రులకు తాను మాట ఇస్తున్నానని ఆయన చెప్పారు. తమ పిల్లల జీవితాలు వృథా కావని వారి తల్లులకు తాను హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. మీ పిల్లలను కాపాడేందుకు నక్సలిజాన్ని, మావోయిజాన్ని అంతం చేస్తానని ప్రతి తల్లికి వాగ్దానం చేస్తున్నానని ప్రధాని తెలిపారు.