మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూల పార్టీ భారీ విజయం

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని అందుకుంది. మూడింట రెండొంతుల మెజార్టీని సాధించింది. మొత్తం 93 స్థానాలకు గానూ కడపటి వార్తలందేసరికి 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించగా ఆ పార్టీ 63 చోట్ల విజయం సాధించింది. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 
 
మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. మయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది పోటీ చేశారు.  పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మెజార్టీకి అవసరమైన సీట్లను పీఎన్‌సీ గెలుచుకుంది. 
 
చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి. తాజా ఫలితాలు చైనావైపు ముయిజ్జు మొగ్గుచూపడాన్ని ప్రజలు సమర్ధించినట్టు స్పష్టం చేస్తున్నాయి.  దీంతో చైనాతో ఆర్థిక సంబంధాల్ని పెంచుకోవటం, భారీ ప్రాజెక్టులను చైనాకు అప్పగించటం, వివాదాస్పద స్థలంలో వేలాది భవన నిర్మాణాలు.. మొదలైన వాటిపై ముయిజ్జు ప్రభుత్వానికి పార్లమెంట్‌లో అనుకూల పరిస్థితి ఏర్పడింది.
 
పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికి వారం రోజుల పట్టే అవకాశం ఉండగా మే మొదటి వారంలో కొత్త పార్లమెంట్ కొలువుదీరనుంది.  ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రమే విజయం సాధించారని, ఈ ముగ్గురూ ముయిజ్జు పార్టీకి చెందిన అభ్యర్థులేనని స్థానిక మీడియా తెలిపింది.  గతేడాది సెప్టెంబరులో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మహ్మద్ ముయిజ్జు విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 
అయితే, రద్దయిన పార్లమెంట్‌లో పీన్పీసీ, దాని మిత్రపక్షాలకు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ) ప్రస్తుతం కేవలం 12 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 73 శాతం ఓటింగ్ నమోదయినట్టు మాల్దీవుల ఎన్నికల సంఘం ప్రధాని అధికారి ఫౌద్ తౌఫీక్ ప్రకటించారు. 

భూమధ్యరేఖకు సమీపంలో దాదాపు 800 కిలోమీటర్ల (500 మైళ్లు) విస్తీర్ణంలో 1,192 చిన్న పగడపు ద్వీపాలతో కూడిన లోతట్టు దేశమైన మాల్దీవులు  గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగతుండటంతో ముప్పును ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గతంలో నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ముయిజ్జు  ప్రతిష్టాత్మకమైన భూ పునరుద్ధరణ, ఎత్తైన ద్వీపాలను నిర్మించడం ద్వారా మునిగిపోయే ముప్పును తిప్పికొడతానని వాగ్దానం చేశారు. 
 
అయితే, ఈ విధానం మరింత వరదలకు కారణమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.  సహజ సిద్ధమైన బీచ్‌లు, రిసార్ట్‌ల‌తో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మాల్దీవులు గుర్తింపు పొందింది. పర్యాటకులకు గమ్యస్థానంగా ఉంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో ఇది హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా మారింది.