జెఎన్‌యు ఎప్పుడూ ‘దేశ వ్యతిరేకం’ లేదా ‘తుక్డే తుక్డే గ్యాంగ్’ కాదు

 
* పిటిఐ సంపాదకులతో వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ పండిట్
 
దేశంలో ప్రతిష్టాకరమైన జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ ( జెఎన్‌యు) ఎప్పుడూ ‘దేశ వ్యతిరేకం’ కాదు, లేదా ఏ ‘తుక్డే-తుక్డే ముఠా’లో భాగం కాదని  విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ పండిట్ స్పష్టం చేశారు. ఈ విశ్వవిద్యాలయం ఎల్లప్పుడూ అసమ్మతిని, చర్చను,  ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆమె తెలిపారు.
 
ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పిటిఐ ప్రధాన కార్యాలయంలో సంపాదకులతో ఇటీవల జరిపిన గోష్టిలో విశ్వవిద్యాలయానికి మొదటి మహిళా వైస్-ఛాన్సలర్ అయిన శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ విశ్వవిద్యాలయం “కాషాయీకరించబడలేదు” అని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. ఆమె జెఎన్‌యు పూర్వ విద్యార్థి కూడా. 
 
 అయితే ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పుడు క్యాంపస్ లో విభిన్న వర్గాల మధ్య  కేంద్రీకృతమైన దశ నెలకొనడం “దురదృష్టకరం” అని తెలిపారు. ఈ విషయంలో రెండు వైపులా (విద్యార్థులు, పరిపాలన) తప్పులు ఉన్నాయని, పరిస్థితిని నిర్వహించడంలో నాయకత్వం తప్పు కూడా ఉందని ఆమె పేర్కొన్నారు.
 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)తో తనకున్న అనుబంధం గురించి పశ్చాత్తాపపడడం లేదని, దాచిపెట్టడం లేదని ఆమె స్పష్టం చేశారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించినప్పటి నుంచి చెన్నైలో మధ్యతరగతి దక్షిణ భారత కుటుంబంలో పెరిగే వరకు తన జీవితం గురించి సుదీర్ఘంగా మాట్లాడిన పండిట్, “సంఘి వీసీ అని పిలువడం గర్వంగా భావిస్తున్నాను” అని చెప్పారు. అదే సమయంలో తన హయాంలో   జెఎన్‌యు అత్యధిక క్యూఎస్ ర్యాంకింగ్స్ పొందటం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. 
 
“ఒక యూనివర్శిటీగా మనం వీటన్నింటికీ అతీతంగా ఉండాలి’ అని ఆమె తెలిపారు. జెఎన్‌యు దేశం కోసం, ఏదైనా ప్రత్యేక గుర్తింపు కోసం కాదు.  జెఎన్‌యు అంటే సమ్మిళితం, అభివృద్ధి. ఇది ఏడు `డి’లపై ఆధారపడి ఉంటుందని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను. అవి,  అభివృద్ధి, ప్రజాస్వామ్యం, అసమ్మతి, భిన్నత్వం, చర్చ, గోష్టి, బేదాభిప్రాయాలు.”
 
2022లో శాంతిశ్రీ పండిట్ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. క్యాంపస్ విద్యార్థుల ఆందోళనలతో నిండి ఉంది.  ఒక కార్యక్రమంలో క్యాంపస్‌లో దేశ వ్యతిరేక నినాదాలు లేవనెత్తిన ఆరోపణలపై 2016 వివాదం నుండి ఇంకా కోలుకోలేదు. నినాదాలు చేయడంలో పాల్గొన్న విద్యార్థులను ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’ సభ్యులుగా ముద్ర వేశారు. భారతదేశాన్ని ముక్కలు చేయాలంటూ లేవనెత్తిన నినాదాన్ని ప్రస్తావించారు.
 
వర్సిటీకి గల దేశ వ్యతిరేక ఇమేజ్ గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “ఇది రెండు వైపులా పొరపాట్లు జరిగిన దశ” అని పండిట్ పేర్కొన్నారు. “దానిని నియంత్రించడంలో నాయకత్వం దారి తప్పిందని నేను భావిస్తున్నాను. ఏ విశ్వవిద్యాలయానికైనా 10 శాతం వెర్రి అంచు ఉంటుంది. ఇది జెఎన్‌యులో మాత్రమే కాదు. విపరీతమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులను మనం ఎలా ఎదుర్కొంటాము అన్నది నాయకత్వంకు సంబంధించిన అంశం.. కానీ మేము దేశ వ్యతిరేకులమని లేదా ‘తుక్డే-తుక్డే’ అని అనుకోవద్దు” అని తెలిపారు.
 
“కొందరు విభేదిస్తారు, వాదిస్తారు అని మీరు అర్థం చేసుకోవాలి. విశ్వవిద్యాలయం ఎప్పుడూ దేశ వ్యతిరేకం కాదు. నేను చదువుకున్నప్పుడు (జెఎన్‌యులో) ఇక్కడ  అది వామపక్ష ఆధిపత్యం తీవ్రస్థాయిలో ఉంది, అప్పుడు కూడా ఎవరూ దేశ వ్యతిరేకులు కాదు,” అని పండిట్ చెప్పారు. “వారు విమర్శించేవారు. విమర్శించడం, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం దేశ వ్యతిరేకం కానేరదు. పరిపాలన  జెఎన్‌యుని అర్థం చేసుకోలేదని, అది దురదృష్టకర దశ అని నేను భావిస్తున్నాను” అని ఆమె వివరించారు.
 
ఐఎంఏ, నేవల్ అకాడమీ వంటి మిలటరీ అకాడమీల గ్రాడ్యుయేట్‌లకు అందజేసే డిగ్రీలన్నీ జేఎన్‌యూకి చెందినవేనని ఆమె గుర్తు చేశారు. “ఆ తర్కం ప్రకారం వెళితే, భారత సైన్యం కూడా దేశ వ్యతిరేకిగా పరిగణించబడుతుంది” అని పండిట్ పేర్కొన్నారు. 61 ఏళ్ల పండిట్ బాధ్యతలు స్వీకరించినప్పుడు, క్యాంపస్‌లోని వామపక్ష విద్యార్థులకు ఆమెను మితవాద రాజకీయాలకు ప్రతినిధిగా, విశ్వవిద్యాలయం దేశ వ్యతిరేకం అనే అభిప్రాయానికి మద్దతుదారుగా కనిపించారు.
 
పండిట్ 1962లో రష్యాలోని అప్పటి లెనిన్‌గ్రాడ్‌లో భాషాశాస్త్రం బోధిస్తున్న విద్యావేత్త తల్లికి జన్మించారు. ప్రసవం అయిన వెంటనే ఆమె తల్లి మరణించింది. దానితో ఆమెను పండిట్‌ను రష్యా సంరక్షకులు దాదాపు రెండు సంవత్సరాలు పెంచారు. వారు ఆమెను నవంబర్ 1963లో భారతదేశానికి తీసుకువచ్చి చెన్నైలోని ఆమె జర్నలిస్ట్ తండ్రికి అప్పగించారు.
 
ఆమె స్కూల్ టాపర్. ఆమె మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి న్యూఢిల్లీలోని ఏఐఐఎంఎస్ లో చేరారు. కానీ మూడు నెలల తర్వాత నిష్క్రమించారు. ఎందుకంటే ఆమె గైనకాలజీ లేదా పీడియాట్రిక్స్ మధ్య ఎంచుకోవలసి వచ్చింది.  ఆమె ప్రాధాన్యత ఇచ్చిన న్యూరాలజీని తీసుకోలేరని  చెప్పారు. దానితో ఆమె చరిత్రను అభ్యసించింది. విద్యాసంబంధ వృత్తిని కొనసాగించింది. 
 
 అది ఆమెను పూణే విశ్వవిద్యాలయానికి డీన్‌గా తీసుకువెళ్లింది. చెన్నైలో పెరిగారు. ఆమె తండ్రి, మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఆర్ఎస్ఎస్ కు చెందిన సేవిక సమితి నిర్వహించే వేసవి శిబిరాలకు ఆమెను పంపేవారు. “నేను ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావంతో అలా పెరిగాను” అని ఆమె చెబుతూ సంఘ్ తనకు ఎప్పుడూ ద్వేషాన్ని బోధించలేదని, అయితే తన జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపిందని ఆమె చెప్పారు.
 
“నేను దానిని దాచడానికి ఇష్టపడను,” ఆమె తన సైద్ధాంతిక అనుబంధాల గురించి చెప్పారు. “నక్సలైట్లు అయిన వాళ్ళు దాచుకోరు, అలాంటప్పుడు నేనెందుకు దాచాలి? నేను దేశ వ్యతిరేకం ఏమీ చేయలేదు. దక్షిణాదిలో ఇక్కడి మాదిరిగా ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయం కాలేదని నేను భావిస్తున్నాను. నా విలువలు చాలా వరకు అక్కడి నుంచే వచ్చాయి.”  “ప్రతి ఒక్కరికి వేర్వేరు అనుబంధాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. నాకు, సంఘ్ చాలా సానుకూల ప్రభావం చూపింది” అని పండిట్ చెప్పారు.