కాంగ్రెస్‌ గెలిస్తే.. మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఆదివారం రాజస్థాన్‌లోని బన్స్వారాలో, జలోర్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొంటూ  అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరని, వాళ్లు ఆ స్థాయికి కూడా వెళ్లగలరని మండిపడ్డారు. 

తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి, దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్నారని ప్రధాని తెలిపారు. ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమే చెప్పిందని మోదీ గుర్తుచేశారు.  ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంపిణీ చేయనున్నారని మోదీ ఆరోపించారు.

‘‘మీ ఆస్తులను చొరుబాటుదారులకు పంచుతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వడం మీకు ఆమోదయోగ్యమేనా? మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. మన తల్లుల వద్ద ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదని, అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినదని ప్రధాని స్పష్టం చేశారు. 

మంగళసూత్రం విలువ బంగారంలోనో, దాని ధరలోనో లేదని, ఆమె కలలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వివాదాస్పద ‘ఫస్ట్‌ క్లెయిమ్‌’ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రస్తుతం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా, తీవ్ర భావజాలంతో ఉందని మోదీ ఆరోపించారు.

చేసిన పాపాలకు కాంగ్రె్‌సను దేశం శిక్షిస్తోంది

కాంగ్రెస్‌ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  ఒకప్పుడు 400సీట్లు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. వారికి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని తెలిపారు.  ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీనికి కాంగ్రెస్సే స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేనివారు, గెలవలేనివారు బరిలో నుంచి పలాయనం చిత్తగించారని ధ్వజమెత్తారు.

 ‘‘రాజస్థాన్‌ నుంచి దక్షిణాది నేత ఒకరిని కాంగ్రెస్‌ రాజ్యసభకు పంపింది. ఈ రాష్ట్ర సమస్యలపై ఆయన సభలో ఎప్పుడూ మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా మీరు రాజ్యసభకు పంపారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. మీ రాష్ట్రంలో ఎన్నడైనా ఆయన్ను చూశారా?” అని ప్రధాని ప్రశ్నించారు. 

” ఇప్పుడు మీరు మరో నేతను కాపాడారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వారు రంగాన్ని వీడి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు’’ అని పరోక్షంగా సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. తొలిదశ పోలింగ్‌లోనే సగం రాజస్థాన్‌ కాంగ్రె్‌సను శిక్షించిందని ప్రధాని తెలిపారు. దేశభక్తిని అణువణువునా నింపుకున్న రాజస్థాన్‌కు కాంగ్రెస్‌ ఎన్నటికీ దేశాన్ని బలోపేతం చేయలేదని తెలుసని స్పష్టం చేశారు. 

 2014కు ముందునాటి పరిస్థితులు మళ్లీ రావాలని ఈ దేశం కోరుకోవడం లేదని చెప్పారు. బంధుప్రీతి, అవినీతి అనే చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా కాంగ్రెస్‌ దేశాన్ని నిర్వీర్యం చేసిందని ప్రధాని మండిపడ్డారు. నేడు దేశం మొత్తం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉందని,  అది చేసిన పాపాలకు శిక్షిస్తోందని అంటూ కాంగ్రె్‌సపై చాలా ఆగ్రహంతో ఉన్న యువత… మళ్లీ ఆ పార్టీ ముఖం చూడలనుకోవడం లేదని మోదీ తేల్చి చెప్పారు.

కూటమిలో కుమ్ములాటలు

ఇండియా కూటమి పరిస్థితి ఎగిరేలోపే దారం తెగిన గాలిపటంలా తయారైందని ప్రధాని విమర్శించారు. అది పేరుకు మాత్రమే పొత్తు అని, చాలా రాష్ట్రాల్లో కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పరస్పరం కొట్లాడుకుంటున్నాయని గుర్తు చేశారు.  ప్రస్తుత ఎన్నికల్లో దేశంలో దాదాపు 25శాతం సీట్లలో ఈ కూటమికి చెందిన వారు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారని చెప్పారు. 

ఎన్నికలకు ముందే ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే ఇక ఆ తర్వాత దోచుకోవడానికి ఇంకెంతకు తెగిస్తారో ఊహించుకోవచ్చని హెచ్చరించారు. ఇలాంటి వారికి ఇంత పెద్ద దేశాన్ని అప్పగిస్తామా? అని మోదీ ప్రశ్నించారు.

 కాగా, సంపద పంపీణీ విషయంలో తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ మండిపడింది. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి నిరాశజనకంగా ఉండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ ఇలాంటి అబద్ధాలకు తెగబడ్డారని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. మోదీ అవాస్తవాలను 140 కోట్ల దేశ ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.