నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పిహెచ్‌డిలో చేరవచ్చు

నాలుగు సంవత్సరాల బ్యాచులర్స్‌డిగ్రీ, 75 శాతం మార్కుల ఉత్తీర్ణత ఉంటే ఇక ఎవరైనా నేరుగా పిహెచ్‌డిలో చేరవచ్చు. ఈ అవకాశాన్ని యుజిసి కల్పించింది.ఈ అర్హతలు ఉన్న విద్యార్థులు జాతీయ అర్హత పరీక్ష (నెట్)కు హాజరయ్యి తద్వారా ఎంచుకున్న అంశంలో పిహెచ్‌డి విద్యాభాస్యానికి అర్హత సాధించుకోవచ్చునని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. 

వచ్చే జూన్ సెషన్ నుంచే ఈ నూతన మార్పు అమలులోకి వస్తుందని ఆయన వివరించారు. జూనియర్ ఫెలోషిప్ (జెఆర్‌ఎఫ్) ఉండి కానీ లేకుండా కానీ పిహెచ్‌డిలో చేరేందుకు నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయెట్ కోర్సులో నిర్ణీత 75 శాతం మార్కులు, లేదా సమాన గ్రేడ్ అవసరం అని వివరించారు. 

ఇప్పటివరకూ అభ్యర్థులు నెట్‌కు హాజరు కావాలంటే మాస్టర్స్ డీగ్రీ (పిజి) ఉండి, ఇందులో కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఇప్పుడు ఈ నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చారు. నాలుగేళ్ల డిగ్రీని అర్హతగా మార్చారు. నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్లతో కూడిన పట్టాను పొందితే, ఖరారు చేసిన మార్కులతో పాసయిన వారికి నెట్ ద్వారా దక్కే పాయింట్ల ప్రాతిపదికన ఎంచుకున్న సబ్జెక్టులలో డాక్టరేట్ డిగ్రీలకు వీలు కల్పించడం జరుగుతుందని యుజిసి ఛైర్మన్ చెప్పారు. 

ఇక ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిల (నాన్ క్రిమీలేయర్) వారికి, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మార్కులలో 5 శాతం మేర సడలింపు ఉంటుంది. యుజిసి ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాల ప్రాతిపదికన ఈ పిహెచ్‌డి అర్హత సడలింపు ప్రకటన వెలువరించారు. నాలుగేళ్ల డిగ్రీ చివరిలేదా ఎనిమిదవ సెమిస్టర్‌లో ఉన్న వారు కూడా సోమవారం నుంచి ఆరంభమమ్యే నెట్ దరఖాస్తుల ప్రక్రియలో తమ దరఖాస్తులు పంపించవచ్చునని జగదీష్‌కుమార్ తెలిపారు.