`హిందూ’, `జై భవాని’ తొలగింపుకు థాకరే విముఖత

* ఎన్నికల కమిషన్ ఆదేశంపై ధిక్కార ధోరణి
 
తమ పార్టీ కొత్త గీతం నుండి “జై భవానీ”, “హిందూ” పదాలను తొలగించేందుకు శివసేన  (యుబిటి) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విముఖత వ్యక్తం చేశారు. ఈ పదాలను తొలగించమని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తమ పార్టీకి నోటీసు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
తన పార్టీ కొత్త గీతం నుండి “జై భవానీ”, “హిందూ” పదాలను తొలగించాలని ఈసీఐ నుండి తనకు నోటీసు అందిందని మీడియా సమావేశంలో చెబుతూ  అయితే తాను ఆ పదాలకు కట్టుబడి ఉంటానని థాకరే చెప్పారు. గీతం నుంచి `జై భవానీ’ని తొలగించాలని కోరడం మహారాష్ట్రను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
 
తమ పార్టీ తన కొత్త ఎన్నికల చిహ్నం “మషల్” (మంటలు మండుతున్న టార్చ్)ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక గీతాన్ని రూపొందించిందని, దాని నుండి “హిందూ”, “జై భవానీ” పదాలను తొలగించాలని ఈసీఐ కోరిందని థాకరే చెప్పారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జా భవాని దేవత ఆశీస్సులతో హైందవి స్వరాజ్‌ను స్థాపించారు. మేము దేవత లేదా హిందూ మతం పేరుతో ఓట్లు అడగడం లేదు. ఇది అవమానకరం. సహించేది లేదు,” అని స్పష్టం చేశారు.
 
తన బహిరంగ సభల్లో జై భవానీ, జై శివాజీ అని చెప్పే విధానాన్ని కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. ‘‘ఎన్నికల సంఘం మాపై చర్యలు తీసుకుంటే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, జై బజరంగ్ బలి అంటూ ఈవీఎంల బటన్‌ను నొక్కాలని ప్రజలను కోరినప్పుడు వారు ఏమి చేశారో వారు మాకు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 
 
అదేవిధంగా, అమిత్ షా అయోధ్యలో రామ్‌లల్లా దర్శనం ఉచితంగా పొందాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు చెప్పారని గుర్తు చేస్తూ వారికోసం చట్టాలను మార్చారా? అని ఆయన ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. 
 
“మా వచ్చిన లేఖకు మేము పంపిన సమాధానంకు ఎన్నికల సంఘం ప్రతిస్పందించలేదు. చట్టాలను మార్చినట్లయితే, మా ఎన్నికల ర్యాలీలలో ‘హర్ హర్ మహాదేవ్’ అని కూడా చెబుతాము,” అని చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు హిందుత్వ ప్రచారం చేసినందుకే తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో ఓటు వేయకుండా, పోటీ చేయకుండా నిషేధించారని మాజీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.