టెల్ అవీవ్‌కు వెళ్లే తమ విమానాలను ఎయిరిండియా ఈ నెల 30 వ తేదీ వరకూ నిలిపివేసింది. పశ్చిమాసియాలో ప్రస్తుత యుద్ధ సంక్షోభం, ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడుల నేపథ్యంలో శుక్రవారం ఎయిరిండియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా భారతీయ ప్రధాన విమానయాన సంస్థ ఎయిరిండియా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌కు వారానికి నాలుగు విమాన సర్వీసులు నిర్వహిస్తూ వస్తోంది. ఇప్పటి పరిస్థితిని సమీక్షించుకుని ఈ విమానాల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు, తరువాత ఉద్రికతలు సడలితే తిరిగి వీటిని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఈ విమాన సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
ఇప్పటికే ఈ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీషెడ్యూలింగ్, క్యాన్సలేషన్ చార్జీల వెసులుబాట్లు కల్పించారు. ఇజ్రాయెల్ సేనలకు, హమాస్ బలగాలకు ఘర్షణల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 7 నుంచి ఎయిరిండియా ఈ ప్రాంతానికి విమానాలు రద్దు చేసింది. వీటిని మార్చి 3వ తేదీ నుంచి పునరుద్ధరించింది. ఇప్పుడు తిరిగి వీటికి బ్రేక్ పడింది.
కాగా దుబాయ్‌కు వెళ్లే విమానాలను కూడా ఎయిరిండియా రద్దు చేసింది. అక్కడ భారీ వర్షాలు, తుపాన్‌తో 70 ఏండ్లలో ఎప్పుడూ ఏర్పడని వాతావరణం నెలకొనడంతో, జనజీవితం స్తంభించడంతో , దుబాయ్ విమానాశ్రయం నీట మునిగిపోవడంతో విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన వెలువరించింది.
ఇలా ఉండగా, యూఏఈలో భారీ వర్షాలతో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చే వాళ్లు లేదా దుబాయ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయంలో సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది.
ఈ మేరకు భారత పౌరులకు అవసరమైన సమాచారం అందించేందుకు హైల్ప్‌లైన్ నంబర్లు: +971501205172, +971569950590, +971507347676, +971585754213 ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం దుబాయ్, సమీప ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.
More Stories
మాస్కోలో సిరియా అధ్యక్షుడు అసద్‌కు రష్యా ఆశ్రయం
చిన్మయ్ కృష్ణదాస్‌పై బంగ్లాదేశ్‌లో మరో కేసు
దక్షిణ కొరియా రక్షణ శాఖ మాజీ చీఫ్ నిర్బంధం