ఇరాన్‌పై క్షిపణులతో ఇజ్రాయిల్ ప్రతీకార దాడి

ఇజ్రాయెల్‌ అన్నంత పనీ చేసింది. ఇరాన్‌పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్యసమితి, అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు  వెల్లడించారు. 
 
ఇరాన్‌లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది.  ఇస్ఫాహాన్‌లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ‘ఫార్స్’ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. 
 
అయితే, మీడియా కథనాలను అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇస్ఫాహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. 
ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది.  అయితే ఇజ్రాయిల్ పై ప్రతీకార దాడులు తిరిగి చేసే ఆలోచన లేదని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
 
సెంట్రల్ ఇస్ఫాహాన్ నగరంలో పేలుళ్లు వినిపించడంతో అనేక నగరాలపై తన వైమానిక రక్షణ వ్యవస్థను సక్రియం చేసిన తర్వాత అనేక డ్రోన్‌లను కూల్చివేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే క్షిపణి దాడి జరగలేదని పేర్కొంది  అర్ధరాత్రి తర్వాత “ఇస్ఫహాన్ మీదుగా ఆకాశంలో మూడు డ్రోన్‌లు గమనించాము. వాయు రక్షణ వ్యవస్థ చురుకుగా మారి ఆకాశంలో ఈ డ్రోన్‌లను నాశనం చేసింది” అని ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది.
 
గత శనివారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్‌లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే.  300లకుపైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో, సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ దాడికి ఇజ్రాయెల్‌ కారణమని భావించిన ఇరాన్‌ ఇటీవలే ప్రతీకార దాడికి దిగిన విషయం తెలిసిందే. గత శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. 

దీంతో ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా ఎయిర్‌ రైడ్‌ సైరన్‌లు వినిపించాయి. అయితే ‘బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ’ను ఉపయోగించి.. ఇరాన్‌ ప్రయోగించిన 300కు పైగా డ్రోన్లు, క్షిపణుల్లో 99 శాతం కూల్చివేసినట్టు ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఇరాన్‌ దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టామని ఆర్మీ అధికార ప్రతినిధి డానియెల్‌ హగేరీ పేర్కొన్నారు. 

ఇరాన్‌ తమ భూభాగంపైకి 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్‌ క్షిపణులు, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. మొత్తంగా వీటిల్లో కొన్ని బాలిస్టిక్‌ క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్‌ భూభాగంపైకి వచ్చాయని, ఒక ఎయిర్‌ బేస్‌కు స్వల్ప నష్టం చేకూరిందని, అయితే అది ఇప్పటికీ పనిచేస్తుందని వెల్లడించారు. 

కాగా, తమ లక్ష్యాన్ని సాధించామని, ఆదివారం ఉదయానికి దాడి ముగిసిందని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్‌ కొనసాగించే అవకాశం లేదని ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మహ్మద్‌ హుస్సేన్‌ భగేరీ పేర్కొన్నారు. మరోవైపు తమ దేశ గగనతలాన్ని రీఓపెన్‌ చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది.

 మరోవైపు దాడి నేపథ్యంలో ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ గట్టి హెచ్చరిక చేసింది. సమయం వచ్చినప్పుడు ఇరాన్‌ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. చెప్పినట్టుగానే తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణులతో ప్రతీకార దాడి చేసింది.