మణిపూర్‌లో పోలింగ్‌ కేంద్రం వద్ద కాల్పుల కలకలం

* కూచ్ బిహార్ లో రాళ్లదాడి

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో మణిపూర్ లోయలోని పోలింగ్ కేంద్రాలకు సమీపంలో కనీసం రెండు కాల్పుల ఘటనలు జరిగాయి. తొలి దశ ఎన్నికల్లో మణిపూర్‌లోని రెండు నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. 

ఇంఫాల్ ఈస్ట్‌లోని ఖురాయ్‌లోని పోలింగ్ స్టేషన్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాయుధ వ్యక్తి కాల్పులు జరపడంతో ఖోయిస్నం సయామైమా (65) అనే వ్యక్తికి బుల్లెట్ గాయమైంది. అనంతరం పోలింగ్ కేంద్రాన్ని ధ్వంసం చేసి పత్రాలను తగులబెట్టినట్లు అధికారులు తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలోని తమన్‌పోక్పిలో ఉదయం కాల్పుల ఘటన కూడా జరిగింది. ఈ రెండు ప్రాంతాలు ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది రాష్ట్రంలోని మెయిటీ మెజారిటీ లోయలో ఎక్కువ భాగం మరియు ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఇన్నర్‌ మణిపూర్‌, ఔటర్‌ మణిపూర్‌ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటర్లు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మొయిరాంగ్ సెగ్మెంట్‌లోని థమన్‌పోక్పిలో గల పోలింగ్ స్టేషన్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.

కొందరు దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పోలింగ్‌ కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులకు పాల్పడిన వారికోసం సమీపంలో గాలిస్తున్నారు. కాగా, కాల్పుల ఘటనతో పోలింగ్‌ బూత్‌ నుంచి ప్రజలు బయటకు పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరోవంక, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది. కూచ్‌ బెహార్‌ జిల్లా దిన్‌హటా ప్రాంతంలో ఎన్నికల వేళ బీజేపీ కార్యకర్త ఇంటి వద్ద బాంబు లభ్యమైంది. దీంతో గ్రామంలో ఘర్షణ జరిగింది. 

ఈ గొడవలో బీజేపీ కార్యకర్తకు తలకు గాయమైంది. మమతా నేతృత్వంలోని అధికార టీఎంసీనే ఈ దాడికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింస జరగవచ్చని బీజేపీ ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అదే ప్రాంతంలో గురువారం రాత్రి మరో ఘటన జరిగింది. ఇద్దరు టీఎంసీ నేతలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు టీఎంసీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ ముందస్తు కుట్రతో దాడి జరిగిందని ఉత్తర బెంగాల్ అభివృద్ధి మంత్రి, టీఎంసీకి నేత, దిన్హటా ఎమ్మెల్యే ఉదయన్ గుహా ఆరోపించారు. బాధితులు ఇద్దరూ దిన్హటాలోని బూత్ కమిటీ అధ్యక్షుడి ఇంటికి వెళుతున్న సమయంలో వారిపై ఆయుధాలతో దాడి జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.

మరోవైపు.. శ్రీరామనవమి సందర్భంగా ముర్షిబాద్ లో నిర్వహించిన ఊరేగింపుపై దాడి జరిగింది. ర్యాలీ చేస్తున్న భక్తులపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. బీజేపీనే ఈ ఘటనకు పాల్పడిందని టీఎంసీ ఆరోపిస్తుండగా.. సీఎం మమతా బెనర్జీ చేసిన విద్వేషకర ప్రసంగాలే దాడికి కారణమని బీజేపీ మండిపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్‌కా గ్రామ స‌మీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్ క‌మాండంట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. సీఆర్పీఎఫ్ జ‌వాన్ ఎన్నిక‌ల డ్యూటీలో ఉండ‌గా ఈ పేలుడు జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 

గాయ‌ప‌డ్డ జ‌వాన్‌ను బైరామ్‌గ‌ర్హ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు. ఐఈడీ పేలుడు నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. ఆ ఏరియాలో కూంబింగ్ చేప‌ట్టారు. లోక్‌స‌భ ఎన్నిక‌లు సజావుగా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నా పోలీసులు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.