మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగడంతో ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్ డ్యామ్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించబోతున్నది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చినట్లు సమాచారం.
 
 ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్‌ను సైతం సైతం ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది.  గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, అది ఎన్నికల సమయం కావడంతో అప్పటి అధికార పక్షం బిఆర్ఎస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు, విమర్శలతో కాలం గడుపుతూ వచ్చాయి. 
 
దానితో ప్రస్తుతం మేడిగడ్డ వద్ద పంపింగ్‌ను నిలిపివేయడంతో ఎండకాలంలో నీటి కొరత తీవ్రమైంది. పంటలు ఎండిపోవడంతో పాటు మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  ఇంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని అంతకు ముందు ఎల్‌అండ్‌టీ సంస్థ పేర్కొంది. 
 
ప్రభుత్వం ఇచ్చిన డిజైన్‌తోనే బ్యారేజీని నిర్మించామని.. అందులో లోపాలకు తాము బాధ్యులం కామన్న సంస్థ చెప్పింది. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందే నిర్మాణ సంస్థనేనని అప్పటి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్‌అండ్‌టీ సంస్థ దిగివచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని ముందుకువచ్చినట్లు తెలుస్తున్నది.