పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ 10 లక్షల కోట్లు

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గత పదేళ్లలో రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.  కిషన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో ”రిపోర్టు టూ పీపుల్‌” పేరిట నివేదిక ను విడుదల చేస్తూ సికింద్రాబాద్ ఎంపీగా , కేంద్రమంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు.

గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పంపిణీ కింద అందించిన నిధులు, సంక్షేమ కార్యక్రమాల కింద చేసిన ఖర్చు, అర్హులైన లబ్ధిదారులకు వివిధ పధకాల కింద అందించిన రుణాలకు చెల్లించిన వడ్డీ రాయితీ, రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల గురించి ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగితే మన దగ్గర కొరత లేకుండా ఇచ్చామని ఆయన చెప్పారు. 

ఒక యూరియా బస్తా మీద రూ. 2236 సబ్సిడీని కేంద్రం ఇస్తుందని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఆసియాలోనే అది పెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ కు హైదరాబాద్ లో భూమి పూజా చేశామని, రూ. 889 కోట్లతో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.

తాను ఏం చేశానో దాదాపు 300 పేజీలతో పుస్తకాన్ని తయారు చేశామని చెబుతూ మొదటి సారి హోంశాఖ సహాయ మంత్రిగా 8 రాష్ట్రాలకు ఇంచార్జ్ గా ఉన్నానని చెప్పారు. ఆర్టికల్ 370 తొలగించినప్పుడు తాను హోం శాఖలోనే ఉన్నానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దులో భాగం కావడం తన అదృష్టం అని పేర్కొన్నారు. కరోనా వచ్చినప్పుడు హోం శాఖను నోడల్ మినిస్ట్రీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని తెలిపారు. 

నోడల్ సెంటర్ కు ఇంచార్జ్ గా పని చేసి, కరోనాసమయంలో సేవ చేశానని వెల్లడించారు. రెండున్నర ఏళ్ల తరువాత తనకు మూడు శాఖలు ఇచ్చి క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చారని, సాంస్కృతిక మంత్రిగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించానని వివరించారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్మాణం చేపడుతున్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, కాజీపేటలో నిర్మిస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వరంగల్ లో ఏర్పాటు చేయనున్న పీఎం మిత్ర టెక్స్ టైల్స్ పార్కు, రామగుండంలో కొత్తగా నిర్మించిన ఎరువుల కర్మాగారం, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు, హైదరాబాద్ మెట్రోకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించిన నిధులను ఆయన ప్రస్తావించారు. 

 సిద్ధిపేట జిల్లా ములుగులో నిర్మించి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాల యం, ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీ య గిరిజన యూనివర్సిటీ, బీబీనగర్ ఎయిమ్స్, హైదరాబాద్ ఐఐటీ, పశువుల ఔషధాల మీద పరిశోధనల కోసం నిర్మించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్, కరోనా సమయంలో మొదలు పెట్టిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, వ్యాక్సినేషన్, రైతులకు సబ్సిడీ కింద అందిస్తున్న ఎరువులు తదితర అంశాల గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.