102 లోక్ సభ స్థానాలకు మొదటి దశ పోలింగ్ రేపే

* పోటీలో 10 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఓ మాజీ గవర్నర్

 లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండగా 21 రాష్ట్రాలు, యుటిల్లోని 102 సీట్లకు ఏప్రిల్‌ 19న మొదటి దశ పోలింగ్‌ జరగనుంది.  ఈ దశలో పది మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సిఎంలు, మాజీ గవర్నర్‌ పోటీలో ఉన్నారు.  దీంతో బుధవారం సాయంత్రంతో  ప్రచారానికి తెరపడింది.

మహారాష్ట్రలోని నాగపూర్‌ స్థానం నుండి కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ బరిలోకి దిగారు. 2014లో ఆయన ఏడుసార్లు ఎంపిగా ఎన్నికైన విలాస్‌ ముత్తెంవార్‌ను 2.84 లక్షల ఓట్లతో ఓడించారు. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానాపటోల్‌ను 2.16 లక్షల ఓట్లతో ఓడించి సీటును నిలబెట్టుకున్నారు. మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి వికాస్‌ థాకరేతో పోటీ పడుతున్నారు.

మరో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ వెస్ట్‌ నుండి బరిలోకి దిగారు. 2004 నుండి ఆయన మూడు సార్లు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రిజిజుపై అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కాంగ్రెస్‌ అధ్యక్షుడు నబమ్‌ టుకీ బరిలోకి దిగారు. పోర్ట్స్‌, షిప్పింగ్‌, వాటర్‌ వేస్‌ కేంద్ర మంత్రి సర్బదానంద సోనోవాల్‌ అస్సాంలోని డిబ్రూగఢ్‌ నుండి బరిలోకి దిగారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీకి టిక్కెట్‌ ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్‌ను డిబ్రూగఢ్‌ నుండి బిజెపి పోటీకి దింపింది. 

సోనోవాల్‌పై కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ అభ్యర్థి మనోజ్‌ ధనోవర్‌ పోటీ పడుతున్నారు. అస్సాంలో ఆప్‌ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అస్సాంలోని 16 పార్టీల యునైటెడ్‌ అపోజీషన్‌ ఫోరమ్‌ కి ఆప్‌ మిత్రపక్షంగా ఉంది. అస్సాం జాతీయ పరిషద్‌ నుండి లురింజ్యోతి గొగోరు కూడా పోటీలో ఉన్నారు. బీహార్‌లోని ముజఫర్‌ నగర్‌లో త్రిముఖ పోరు నెలకొంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన హరీంద్ర మాలిక్‌, బిఎస్‌పి అభ్యర్థి దారాసింగ్‌లతో కేంద్రమంత్రి సంజీవ్‌ బలియన్‌ పోటీ పడుతున్నారు.

రెండు పర్యాయాలు పార్లమెంటేరియన్‌గా, ప్రధాని మోదీ క్యాబినెట్‌లో జూనియర్‌ మంత్రిగా పనిచేసిన జితేంద్ర సింగ్‌ జమ్ముకాశ్మీర్‌లోని ఉదంపూర్‌ నుండి బరిలోకి దిగారు. మాజీ బిజెపి నేత చౌదరీ లాల్‌ సింగ్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. గులాం నబీ ఆజాద్‌కు చెందిన డిపిఎపి నుండి జిఎం సరూరీని రంగంలోకి దింపింది.

సిట్టింగ్‌ ఎంపి బాలక్‌నాథ్‌ స్థానంలో కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు భూపేంద్ర యాదవ్‌ రాజస్థాన్‌లోని అల్వార్‌ నుండి పోటీపడుతుండగా, కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే లలిత్‌ యాదవ్‌ ఆయనపై బరిలోకి దిగారు. వీరిద్దరూ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. రాజస్థాన్‌లోని మరో నియోజకవర్గం బికనేర్‌ నుండి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌పై కాంగ్రెస్‌ మాజీ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ పోటీపడుతున్నారు.

తమిళనాడులోని నీలగిరి లోక్‌సభ నియోజకవర్గంలో డిఎంకె, బిజెపిల మధ్య గట్టి పోటీ నెలకొంది. డిఎంకె ఎంపి, మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా బరిలోకి దిగగా, కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఎల్‌.మురుగన్‌ బిజెపి నుండి పోటీ పడుతున్నారు. 

మరోవైపు శివగంగ నియోజకవర్గం నుండి కార్తి చిదంబరం పోటీకి దిగగా, బిజెపి నుండి టి.దేవనాథన్‌ యాదవ్‌, అన్నాడిఎంకె నుండి జేవియర్‌ దాస్‌లు పోటీ చేస్తున్నారు. కోయంబత్తూర్‌ నుండి తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలైపై డిఎంకె నేత గణపతి పి.రాజ్‌కుమార్‌, అన్నాడిఎంకె నుండి సింగై రామచంద్రన్‌లు పోటీపడుతున్నారు.

ఇటీవల తెలంగాణ గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన తమిళసై సౌందరరాజన్‌ ఈ సారి చెన్నై సౌత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెపై ప్రముఖ కాంగ్రెస్‌ నేత కుమార్తె కుమారి అనంత పోటీపడుతున్నారు. 2019 ఎన్నికల్లో తూత్తుకుడి నుండి పోటీకిదిగిన తమిళసై సౌందరరాజన్‌పై డిఎంకె అభ్యర్థి కనిమొళి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

తూత్తుకుడి నుండి కనిమొళి మరోసారి బరిలోకి దిగగా, ఎన్‌డిఎ మిత్రపక్షమైన తమిళ మానిల కాంగ్రెస్‌ (మూపనార్‌) ఎస్‌డిఆర్‌ విజరుశీలన్‌ను, అన్నాడిఎంకె ఆర్‌. శివసామి వేలుమణిని పోటీకి దింపాయి.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌ నాథ్‌ చింద్వారా నియోజకవర్గం నుండి పోటీకి దిగారు. 1980 నుండి ఈ స్థానం నుండి కమల్‌నాథ్‌ తొమ్మిదిసార్లు గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ బిజెపి అభ్యర్థిపై నకుల్‌నాథ్‌ 37,536 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

త్రిపురలోని రెండు లోక్‌సభ స్థానాలకు గాను వెస్ట్‌ త్రిపురలో మొదటి దశలో పోలింగ్‌ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేవ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆషిష్‌ కుమార్‌ సాహాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇన్నర్‌ మణిపూర్‌ నియోజకవర్గం నుండి మణిపూర్‌ న్యాయ, విద్యా శాఖ మంత్రి బసంత్‌ కుమార్‌ బిజెపి నుండి పోటీపడుతుండగా, జెఎన్‌యు ప్రొఫెసర్‌ బిమల్‌ అకోయిజామ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మరోవంక, నాల్గవ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు 96 లోక్ సభ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీచేస్తున్నారు. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్ ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1). స్థానాల‌కు నాలుగో ద‌శ‌లో ఎన్నిక‌ల జ‌ర‌గ‌నున్నాయి .