అతి త్వరలో మావోయిస్టుల అంతం

నరేంద్ర మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే దేశంలో నుంచి మావోయిస్టులను తుదముట్టిస్తుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా బుధవారం విస్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరంతరం కార్యక్రమాలు సాగిస్తోందని అమిత్ షా ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టులను భద్రత బలగాలు కాల్చి చంపిన మరునాడు మంత్రి ఈ ప్రకటన చేశారు. ‘మావోయిస్టులపై కార్యక్రమాలు మున్ముందు కొనసాగుతాయని నమ్మకంగా చెప్పగలను. ప్రధాని మోదీ నాయకత్వంలో అతి త్వరలోనే మన దేశంలో నుంచి మావోయిస్టులను నిర్మూలించగలం’ అని అమిత్ షా తెలిపారు.

ముఖ్యంగా మావోయిస్టులకు భౌగోలికంగా దేశం మధ్యభాగంలో అభేద్యమైన రక్షణ కవచంగా ఉంటూ వస్తున్న అబుజ్మద్‌ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి భద్రతా దళాలు ఇంతటి భారీ ఆపరేషన్ చేయగలగడం అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ దట్టమైన అటవీప్రాంతాన్ని తమకు తిరుగులేని కొత్తగా మార్చుకొంటూ పలు హింసాత్మక దాడులకు మావోయిస్టులు పాల్పడుతున్నారు. 

అబుజ్మద్ కొండలు, అడవులు, అక్షరాలా భద్రతాదళాలకు “పరిచయంలేని కొండలు”గా మారాయి. దాదాపు 4,000 చదరపు చదరపు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో ప్రధానంగా నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలను కవర్ చేస్తుంది. వెంటనే కంకేర్‌కు దక్షిణంగా ఉంది.

మూడు నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 80 మందికి పైగా మావోయిస్టులను అంతం చేసినట్లు, 125 మందికి పైగా అరెస్టు చేసినట్లు, 150 మందికి పైగా లొంగిపోయినట్లు హోమ్ శాఖ మంత్రి తెలియజేశారు.

”2019లో ఛత్తీస్‌గఢ్‌లో కనీసం 250 క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. మూడు నెలల కాలంలోనే ఆ రాష్ట్రంలో 80 మంది మావోయిస్టులు హతమయ్యారు. 125కు పైగా అరెస్టులు జరిగాయి. 150 మందికి పైగా నక్సలైట్లు లొంగిపాయారు” అని అమిత్‌షా తెలిపారు. ప్రభుత్వ అఫెన్సివ్‌ పాలసీ‌ కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో చిన్న ప్రాంతానికి మాత్రమే మావోయిస్టులు పరిమితమయ్యారని, త్వరలోనే నక్సల్స్ రహిత ఛత్తీస్‌గఢ్‌‌, నకల్స్ రహిత భారతదేశాన్ని చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.

2014 నుంచి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అధిక సంఖ్యలో భద్రత బలగాల శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 2019 దరిమిలా అటువంటి 250 శిబిరాల ఏర్పాటు జరిగిందని, భద్రత అంతరం పరిహారం అయిందని అమిత్ షా తెలిపారు. 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని  అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని పేర్కొంటూ గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.

ఇలాఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన 29 మందిలో 15 మంది మహిళలు ఉన్నారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. “మేము 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష కొనసాగుతోంది,” అని ఆయన చెప్పారు.

వీరిలో సీపీఐ (మావోయిస్ట్‌) ఉత్తర బస్తర్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హతమైన నక్సలైట్లను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మావోయిస్టుల ఉత్తర బస్తర్ డివిజన్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్, లలిత మృతి చెందిన వారిలో ఉన్నారని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 50 మంది నక్సలైట్లు ఉన్నారని తమకు సమాచారం అందిందని, మిగిలిన వారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని సుందరాజ్ తెలిపారు.