కోర్టు ఆవరణలో మీడియాతో మాటలా?… కవితకు హెచ్చరిక

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మందలించారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడురోజుల సీబీఐ కస్టడీ ముగిసిన కవితను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు హాలులోకి వచ్చేముందు, వెళ్లేముందు ఆమె మీడియాతో మాట్లాడారు.

జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయొద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా హెచ్చరించారు. ‘‘ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో విచారణ సమయంలో చెప్పమనండి. అంతేతప్ప.. కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడితే ఎలా? కోర్టు ఆవరణలో ఇలా మాట్లాడడం సరికాదు. ఒకవేళ మీడియాతో మాట్లాడాలనుకుంటే కోర్టు బయట మాట్లాడమని చెప్పండి’’ అని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావుకు న్యాయమూర్తి సూచించారు.

అనంతరం జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టు నుంచి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కవిత న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టి మళ్లీ మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బిజెపి కస్టడీ అని వ్యాఖ్యానించారు.  ‘ఇది సిబిఐ కస్టడీ కాదు.. బిజెపి కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బిజెపి అడిగిందే.. లోపల సిబిఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’ అని కవిత ఆరోపించారు.

కవిత మూడురోజుల కస్టడీ ముగియడంతో న్యాయస్థానంలో ప్రవేశ పెట్టిన సీబీఐ.. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని కోరింది. అయితే.. ఢిల్లీ మద్యం కేసులోనే కవితకు ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ గతంలోనే కోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో సైతం ఆమెకు న్యాయమూర్తి తొమ్మిదిరోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఈ నెల 23న మళ్లీ న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని ఆదేశించారు. 

కాగా, కవిత మూడురోజుల సీబీఐ విచారణకు సంబంధించి 11 పేజీల రిపోర్టుకు దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించింది.  కానీ, విచారణకు ఆమె సహకరించలేదని, సరైన సమాధానాలు చెప్పలేదని న్యాయస్థానానికి వెల్లడించారు.  సీబీఐ కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత.. అందుకు తన అనారోగ్య సమస్యలను ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్టులను జత చేశారు. ఈ కేసులో సహ నిందితులకు బెయిల్‌ ఇచ్చారని, అలాగే తనకూ బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.