ఉగ్రవాదులను ఎదుర్కొనేటప్పుడు రూల్స్ ఎందుకు!

ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్​ ఉండవని, అలాంటప్పుడు వారికి సమాధానం చెప్పేడప్పుడు కూడా రూల్స్​ ఉండకూడదని  భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్​ జైశంకర్​ స్పష్టం చేశారు. భారత ఇంటెలిజెన్స్​ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లు వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్​లో లోతుగా ఆపరేషన్లు నిర్వహిస్తోందని ‘ది గార్డియన్’ పత్రిక కథనం ప్రచురించిన నేపథ్యంలో జైశంకర్ ఆసక్తి కలిగిస్తున్నాయి.
 
తన పుస్తకం ‘వై భారత్ మ్యాటర్స్’ మరాఠీ అనువాదం ఆవిష్కరణ సందర్భంగా పుణెలో యువకులతో ముఖాముఖి సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ముంబైలో 26/11 దాడుల తర్వాత అందరూ పాకిస్తాన్​కు సమాధానం చెప్పాలని భావించారని గుర్తు చేశారు. కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం చర్చల్లో నిమగ్నమైపోయిందని ఎద్దేవా చేశారు. 
 
చివరికి “పాకిస్థాన్​పై దాడి చేయకపోతే అయ్యే ఖర్చు కంటే ఆ దేశంపై దాడి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ” అని యూపీఏ తేల్చినట్టు ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అయితే, భారత విదేశాంగ విధానంలో గత పదేళ్లగా గణనీయమైన మార్పు వచ్చిందని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొడానికి అదే సరైన విధానమని  జైశంకర్ తెలిపారు.
 
ఏయే దేశాలతో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందని యువతి ప్రశ్నించగా.. పొరుగున ఉన్న పాకిస్థాన్‌ అని టక్కున బదులిచ్చారు.  “మనం సంబంధాలను కొనసాగిస్తామా? అని మీరు అడగగల దేశాలు ఉన్నాయి. నేడు అతిపెద్ద సవాలు పాకిస్థాన్. నరేంద్ర మోదీ 2014లో మాత్రమే వచ్చారు. కానీ ఈ సమస్య 2014 లో ప్రారంభం కాలేదు. ఇది 1947లో ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు.ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ఉపయోగించి చర్చల వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించబోము,” అని స్పష్టం చేశారు.

‘సరిహద్దులకు ఆవల ఉన్నాం కదా.. మనల్ని ఎవరూ టచ్‌ చేయలేరని ముష్కరులు అనుకుంటున్నారు.. అది నిజం కాదని మనం రుజువు చేయాలి. ఉగ్రవాదులు ఎలాంటి రూల్స్‌ పెట్టుకుని దాడులు చేయరు.. అలాంటప్పుడు వారి చర్యలకు ప్రతిచర్యలు కూడా నియమాలకు లోబడి ఉండాల్సిన అవసరం లేదు’ అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.

 
విదేశాంగ విధానంలో మార్పు గురించి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. 50 శాతం య‌ధావిధిగా ఉంద‌ని, మ‌రో 50 శాతం మారిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఉగ్ర‌వాదం విష‌యంలో మార్పు చెందిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఒక‌వేళ ముంబై అటాక్ లాంటి ఘ‌ట‌న ఇప్పుడు జ‌రిగితే, ఒక‌వేళ ఆ ఘ‌ట‌న‌కు స్పందించ‌కుంటే, అప్పుడు జ‌ర‌గ‌బోయే దాడుల‌ను ఎవ‌రు నియంత్రిస్తార‌ని మంత్రి జైశంక‌ర్ ప్రశ్నించారు.