రణ్ దీప్ సూర్జేవాలాకు ఈసీ షోకాజ్ నోటీసు

 
* హేమామాలినిపై అనుచిత వాఖ్యలకు

బిజెపి ఎంపీ, ప్రముఖ నటి హేమా మాలినిపై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు ఎన్నికల సంఘం కాంగ్రెస్ నాయకుడు రణ్ దీప్ సూర్జేవాలాకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. బిజెపి షేర్ చేసిన వీడియోలో సూర్జేవాలా ‘‘ప్రజలు తమ ఎంపీ/ఎంఎల్ఏ లను ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజా గళాన్ని వారు వినిపిస్తారని. మీరు  ఎన్నుకున్న హేమా మాలినిలా కాదు’’ అంటూ అనుచితంగా మాట్లాడారు.

అయితే,  సూర్జేవాలా దీనిని ఖండించారు. బిజెపి ఐటి సెల్ మార్చి వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పెట్టిందని ఆరోపించారు. ‘‘హేమాజీ అంటే మాకెంతో గౌరవం, ఆమె ధర్మేంద్ర జీని వివాహం చేసుకున్నారు. ఆ లెక్కన ఆమె మాకు కోడలితో సమానం’’ అని స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం 5 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం సూర్జేవాలాను కోరింది. కాగా, మహిళల గురించి కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభలలో చేసే ప్రసంగాలు వారి గౌరవాన్ని గౌరవించేలా చూడాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖకూడా ఎన్నికల కమిషన్ లేఖ రాసింది.  ఈ విషయమై శుక్రవారం రోజు ముగిసేలోగా తీసుకున్న చర్యల వివరాలతో సమాధానం ఇవ్వాలని ఖర్గేను ఈసీ కోరింది.

సూర్జేవాలా చేశారన్న వ్యాఖ్యలపై హేమా మాలిని స్పందించారు. ‘‘పేరు ప్రఖ్యాతులున్న వారిని కాంగ్రెస్ లక్ష్యం చేసుకుంటోంది. పేరుప్రఖ్యాతులున్న వారిని తక్కువ చేయడం వల్ల వారికేమి మేలు జరుగదు. వారు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధాని మోదీ నుంచి నేర్చుకోవాలి’’ అని మథురా ఎంపీ అయిన హేమా మాలిని హితవు చెప్పారు.

సూర్జేవాలా అన్న వీడియో సంగ్రహాన్ని ఎన్నికల సంఘం షేర్ చేస్తూ ‘‘ ఆయన వ్యాఖ్యలు అమర్యాదగా, అసభ్యంగా  ఉన్నాయి. అవి శ్రీమతి హేమా మాలినిని అవమానించే విధంగానే కాదు, ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కించ పరిచే విధంగా ఉన్నాయి. అంతేకాక ఓ పార్లమెంటు సభ్యురాలి గౌరవాన్ని, హుందాతనాన్ని, ప్రజా జీవితంలో ఉన్న మహిళను, మహిళలను అగౌరవపరిచేదిగా ఉంది’’ అని పేర్కొంది.

ఇలా ఉండగా, బిజెపి అభ్యర్థి, నటి కంగనా రనౌత్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల ఏప్రిల్ 1న మరో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటేపై ఇప్పటికే ఆక్షేపణ వ్యక్తం చేసిన్నట్లు ఖర్గేకు రాసిన లేఖలో ఈసీ గుర్తు చేసింది. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని పార్టీ కార్యకర్తలకు సలహా ఇవ్వాలని ఖార్గేను ఈసీ కోరింది.

మరోవైపు నటి, బీజేపీ ఎంపీ హేమమాలినిపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలాకు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేణు డబ్ల్యూ భాటియా సుర్జేవాలా కాంగ్రెస్ నాయకుడని, ఇటువంటి వాఖ్యలు చేయడం సిగ్గుచేటని స్పష్టం చేశారు.

హేమా మాలిని ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర నుంచి వరుసగా మూడోసారి పోటీచేయబోతున్నారు. ఆమె పోటీ చేసే లోక్ సభ ఏడో దశ ఎన్నిక ఏప్రిల్ 26న జరుగనున్నది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది. నర్తకి, నటి, ఇద్దరు పిల్లల తల్లి, పార్లమెంటు సభ్యురాలు అయిన హేమా మాలినిపై వ్యాఖ్యానించేప్పుడు కాంగ్రెస్ నేత సూర్జేవాలా కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడి ఉంటే బాగుండేది.

మహిళల పట్ల అనుచిత వాఖ్యల పట్ల సద్గురు ఆందోళన

ఇలా ఉండగా, ఇటీవలి కాలంలో రాజకీయ ప్రసంగాలలో మహిళలను ఉద్దేశించి ఉపయోగిస్తున్న భాష పట్ల ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సమాజం బాగు కోసం అటువంటి భాషను ఉపయోగిస్తున్న వ్యక్తులను నిషేధించాలని ఆయన ఎక్స్ వేదికగా సూచించారు.

గత రెండు వారాలుగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో మహిళల గురించి ఉపయోగిస్తున్న భాషలో రేట్ కార్డు, తల్లిదండ్రుల గురించి ప్రశ్నలు, ఒక 75 ఏళ్ల మహిళ గురించి అసహ్యకరమైన వ్యాఖ్యలు వంటివి వినిపిస్తున్నాయని సద్గురు తెలిపారు. మనకు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులను నిషేధిస్తే మంచిదని ఆయన మీడియాకు, ప్రభావశీలురకు పిలుపునిచ్చారు. మహిళల పట్ల మన వైఖరిలో మార్పు రావాలని ఆయన స్పష్టం చేశారు.