విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు

అమరావతికి రాజధానిగా అమరావతిని వచ్చే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని, తెలుగు వారి పండుగల్లో మొదటిదైన ఉగాది రోజున ఈ ప్రాంత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హామీగా తాను పేర్కొంటున్నానని బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జి, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ వెల్లడించారు.

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పనితీరులోని లోపాలు, తప్పుడు ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఐదేళ్ల కాలంలో రాజధానిని ఎందుకు వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేయలేకపోయిందని ప్రశ్నించారు. 

అమరావతి రాజధాని అనేది ప్రధాని నరేంద్రమోదీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ అని, దాన్ని తప్పకుండా తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలతో తమ మహాకూటమి నెరవేరివేర్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దురుద్దేశంతోనే ఆలస్యం చేశారని ధ్వజమెత్తారు.  నిర్మాణం ఆలస్యం చేయడానికి, ఖర్చు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా డిజైన్లలో మార్పులు చేశారని, వ్యయం ఎక్కువ చేయడం ద్వారా ఎక్కువ మంది గుత్తేదారులు వచ్చేలా చేసి లబ్ధిపొందాలనే సిండికేట్‌ కనిపిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఇలా ఉండగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగదని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పరిశ్రమకు వచ్చే పెట్టుబడులు ఆగవని సిద్ధార్థనాథ్ సింగ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన పెట్టుబడుల ఉపసంహరణపై అనేక ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వస్తాయని, అంతమాత్రాన ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు కాదని తెలిపారు. 

దీనిపై కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటివరకు అసలు చర్చించలేదని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించొద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు.  తెలుగు నేలపై ఉగాది వేడుకల్లో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ వికసిత్ భారత్‌తో పాటు వికసిత్ ఆంధ్రాను ప్రధాని నరేంద్రమోదీ సంకల్పించారని తెలిపారు.

రాష్ట్రంలో డబుల ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం చాలా ఉందని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం ప్రజల వద్దకు చేరుతాయని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో కేంద్ర పథకాలను ఆశించిన స్థాయిలో వైసీపీ ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకెళ్లలేదని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు పార్టీలు కలిశాయని చెబుతూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటే పథకాల అమలు కోసం ప్రధాని కూడా ప్రత్యేక దృష్టి పెడతారని భరోసా ఇచ్చారు. దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు పేదల కోసం తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అందలేదని విచారం వ్యక్తం చేశారు. 

 22.5లక్షల ఇళ్లు పేదల కోసం ప్రధాని మోదీ కేటాయించగా, గత ఐదేళ్లు కేవలం 3 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలుస్తోందని తెలిపారు. అదేవిధంగా, వచ్చే ఐదేళ్లలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పోలవరం నిర్మిస్తామని వెల్లడించారు.